హిట్ సినిమా ఫ్రాంచైజీని వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఇప్పుడు సీక్వెల్స్, ప్రీక్వెల్సే ఓ ట్రెండ్. మిగిలిన వాటితో పోలిస్తే వాటికే మంచి గిరాకీ ఉంది. ‘జాతిరత్నాలు’ ని కూడా బ్రాండ్ గా చేసి సినిమాలు తీసుకొంటూ పోవొచ్చు. చిన్న సినిమాలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన ప్రాజెక్ట్ అది. అనుదీప్ రైటింగ్ స్టైల్‌కి అంతా ఫిదా అయిపోయారు. ‘జాతిరత్నాలు 2’ చేసే ఆలోచన అనుదీప్‌కి సైతం ఉంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ చేయకూడదని భావిస్తున్నాడు ప్రియదర్శి. ఒకవేళ జాతిరత్నాలు 2 కథ తన దగ్గరకు వస్తే `నో` చెబుతా అంటున్నాడు ఈ హీరో.
”జాతిరత్నాలు అనేది మ్యాజిక్. ఒకేసారి జరుగుతుంది. మళ్లీ మళ్లీ ట్రై చేయకూడదు. దాన్ని అలా వదిలేయాలి. ఇప్పటికీ ఓ కామెడీ సినిమా వస్తోందంటే జాతిరత్నాలుతో పోలుస్తుంటారు. అంటే దానికి కల్ట్ స్థానం ఇచ్చేసినట్టే. అలాంటి సినిమాని మళ్లీ చేసి, పాడు చేయకూడదు. కావాలంటే దానికంటే బెటర్ అవుట్ పుట్ ఇచ్చే కథలు చేయాలి” అని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.
తన కొత్త సినిమా `మిత్రమండలి` ఈ దీపావళికి వస్తోంది. ఈసినిమాలో ఎందుకో ‘జాతిరత్నాలు’ వైబ్ కనిపిస్తోంది. కానీ ప్రియదర్శి మాత్రం “ఈ రెండు కథలూ వేరు. కామెడీ పండించే స్టైల్ వేరు. అప్పట్లో జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్ అయ్యిందో, ఇప్పుడు మా మిత్రమండలి అంత పెద్ద హిట్ అవుతుంన్న నమ్మకం ఉంది“ అన్నాడు ప్రియదర్శి.