సవీంద్రారెడ్డి అనే వ్యక్తిని గంజాయి కేసులో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ కేసుపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తికి అనుమానం వచ్చింది. పోలీసులు చెబుతున్నదానికి, నిందితులు చెబుతున్నదానికి చాలా తేడా ఉందని.. తప్పుడు కేసు పెట్టినట్లుగా అనుమానాలు ఉన్నాయని సీబీఐ విచారణకు ఆదేశించారు. పోలీసులు తప్పుడు కేసు పెట్టారో లేదో తేల్చాలని ఆదేశించారు. అయితే ఈ తీర్పుపై పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ దొరికితే.. ఆ కేసుకు రాజకీయ కారణాలు ఆపాదించుకుంటున్నారని.. సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నంత మాత్రాన గంజాయి కేసును రాజకీయ కేసుగా ప్రచారం చేయడం సరి కాదని వాదించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. సీబీఐ తదుపరి విచారణ నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ తదుపరి విచారణ త్వరలో చేపడతామని తెలిపింది.
మంగళగిరికి చెందిన సవీంద్రారెడ్డి వైసీపీ సోషల్ మీడియాలో పని చేస్తారు. ఆయన గంజాయి స్మగ్లింగ్ చేస్తూండగా పోలీసులు పట్టుకున్నారు. ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆయన భార్య హైకోర్టులో పిటిషన్ వేసింది. పోలీసులు రహస్యంగా అరెస్టు చేశారని.. డ్రెస్సులో లేరని.. ఆరింటికి అరెస్టు చేసి ఏడు గంటలకు కూడా అరెస్టు చూపించలేదని ఇలా అనేక కారణాలతో తప్పుడు కేసు అని వాదించారు. ఈ కేసును సీబీఐకి హైకోర్టు ఇచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ విచారణను నిలుపుదల చేసింది.