తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను పరామర్శించడానికి బెంగళూరు వెళ్లారు. అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుని ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు ఖర్గే. రేవంత్ సోమవారం వెళ్లి పరామర్శించి..జూబ్లిహిల్స్ ఉపఎన్నికపై చర్చించి వచ్చారు. మంగళవారం ఖర్గేను పరామర్శించడానికి పొంగులేటి వెళ్లారు. సీఎంతో వెళ్లకుండా ఆయన విడిగా వెళ్లడం ఏమిటని కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో రేవంత్ ఎక్కడికి వెళ్లినా పక్కన పొంగులేటి కనిపించేవారు. కొన్నాళ్లు అలాగే నడిచింది. తర్వాత క్రమంగా పొంగులేటి రేవంత్ తో కలిసి కనిపించడం తగ్గిపోయింది. రేవంత్ వద్ద ఉన్న ప్రాధాన్యతను ఆయన దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. పలువురు ఎమ్మెల్యేలు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఏ కార్యక్రమంలోనూ కలిసి వెళ్లడం లేదు. ముఖ్యమంత్రి వెళ్తున్నారంటే ఆయనతో పాటు వెళ్లి ఖర్గేను పరామర్శించవచ్చు.
కానీ పొంగులేటి మాత్రం తాను ప్రత్యేకంగా వెళ్లి పరామర్శించారు. పార్టీ వ్యవహారాలపై మాట్లాడకుండా ఉండరని.. మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. పొంగులేటి రేవంత్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారని ఎవరూ అనుకోవడం లేదు కానీ.. భవిష్యత్ లో ఏం జరుగుతుందో చెప్పలేమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.