బీహార్ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. నామినేషన్లకు ఎంతో సమయం లేదు. కానీ ప్రధానంగా పోటీ పడుతున్న కూటములు మాత్రం సీట్ల సర్దుబాటును పూర్తి చేసుకోలేకపోయాయి. బీహార్ లో కూడా జాతీయ పార్టీలకు పూర్తి స్థాయి పట్టు లేదు. లోకల్ పార్టీలతోనే కలిసి పోటీ చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీతోనూ.. బీజేపీ జేడీయూతోనూ కలిసి పోటీ చేస్తున్నాయి. కమ్యూనిస్టులు ఇతర పార్టీలు కాంగ్రెస్ కూటమివైపు ఉన్నాయి. రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు ఎన్డీఏలో ఉన్నారు. ఇలా అన్ని పార్టీలు కలిసి రెండు కూటములుగా పని చేస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ ఏ కూటమిలో చేరలేదు. ఒంటరిగా పోటీ చేస్తున్నారు. అందుకే ఆయన అభ్యర్థుల ప్రకటనకు రెడీ అయిపోయారు.
బీజేపీ కూటమిలో పరిస్థితి ప్రశాంతంగా లేదు. జేడీయూ, బీజేపీ మధ్య ఆధిపత్యపోరాటం ఉంది. నిజానికి ఒకప్పుడు నితీష్ నేతృత్వంలోని జేడీయూ మేజర్ పార్టనర్. రాను రాను ఆ పార్టీ క్షీణించుకుపోతోంది. గతంలో కలిసి పోటీ చేసినప్పుడు జేడీయూ ఎక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ బీజేపీ కన్నా తక్కువ సీట్లలో గెలిచింది. ఇప్పుడు రెండు పార్టీలు ఆధిపత్య పోరాటం ఎందుకు.. చెరో సగం సీట్లలో పోటీ చేద్దామన్న ప్రతిపాదనకు వస్తున్నాయి. కానీ ఇతర చిన్న పార్టీలు జేడీయూ సీట్ల నుంచే కేటాయింంపులు చేయాల్సి రావొచ్చు. నితీష్ కుమార్ కు మరో మార్గం లేదు.
ఇక ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య సీట్ల పంచాయతీ తేలడం లేదు. గతంలో ఎక్కువ సీట్లు తీసుకుని అతి తక్కువ సీట్లలో గెలిచిన కాంగ్రెస్ తమ గెలుపు అవకాశాల్ని దెబ్బకొట్టిందని ఆర్జేడీ భావిస్తోంది. అందుకే ఈ సారి భారీగా సీట్లు కేటాయించేందుకు ఆసక్తి చూపించడం లేదు. కానీ కాంగ్రెస్ ఓడిపోయినా తమకు భారీ సీట్లను కేటాయించాలని అంటోంది. అంతే కాదు సులువుగా ఆర్జేడీ గెలుస్తుందన్న సీట్ల కోసం పట్టుబడుతోంది. అందుకే ఒంటరి పోటీకి అయినా సిద్ధిని.. తేజస్వీ యాదవ్ అభ్యర్థులను రెడీ చేసి పెట్టుకున్నారు.
తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు అంటే మూడు రోజుల్లోనేవారు సీట్ల సర్దుబాటు చేసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేసుకోవాల్సిన ఉంది. లేకపోతే ఆ గందరగోళం నామినేషన్ల వరకూ సాగనుంది.