కరూర్ తొక్కిసలాట ఘటన .. టీవీకే అధ్యక్షుడు విజయ్‌కు పెద్దసమస్యగా మారింది. సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన పార్టీ నేతలు దాఖలు చేసిన పిటిషన్లు చివరికి సిట్ విచారణకు దారి తీశాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ప్రత్యేకంగా సిట్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ జరుపుతోంది. అలాగే హైకోర్టు ఆదేశించిన సిట్ కూడా సీనియర్ ఐపీఎస్ ఆస్రాగార్గ్ నేతృత్వంలో విచారణ జరుపుతోంది.
ఇప్పుడు సిట్ విచారణను ఆపేయాలని విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి కారణం హైకోర్టు చేసిన వ్యాఖ్యల్నే చూపించారు. ఘటన జరిగిన తర్వాత టీవీకే పార్టీ నాయకులు అంతా పారిపోయారని హైకోర్టు వ్యాఖ్యానించారు. ఇలా వ్యాఖ్యానించడం ద్వారా దర్యాప్తును ఇప్పటికే ప్రభావితం అయినట్లు అయిందని.. తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం, కుట్ర లేదని అనడానికి లేదని ఆయన పిటిషన్ లో వాదించారు. తొక్కిసలాట ఘటనలో తన తప్పు లేదని విజయ్ చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏర్పాట్లు చేయలేదని.. అదనీ..ఇదనీ ఎన్ని ఆరోపణలు ప్రభుత్వంపై చేసినా… ఆ ఇరుకు ప్రదేశంలో ఎక్కువగా జన సమీకరణ చేయడంతో పాటు ఎక్కువ మంది గుమికూడేలా చేసుకుని అత్యంత ఆలస్యంగా సభా ప్రాంగణానికి రావడం వంటివి జరిగాయని ఇప్పటికే గుర్తించారు. ఈ వ్యవహారంలో ఎవరు ఎలాంటి నివేదికలు ఇచ్చినా.. అది విజయ్ కు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు.