తెలంగాణ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ గురువారం అనుకున్నట్లుగానే జారీ కానుంది. హైకోర్టులో బుధవారం జరిగిన విచారణలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఇవ్వలేదు. గురువారం కూడా విచారణ సాగనుంది. గురువారం మధ్యాహ్నం తిరిగి విచారణ జరుగుతుంది. మరిన్ని వాదనలు వినిపిస్తామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. దాంతో వాయిదా పడింది. ఇదే సమయంలో నోటిఫికేషన్ గురువారమే వస్తుందని.. తీర్పు వచ్చే వరకూ ఆపేలా స్టే ఇవ్వాలని పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని హైకోర్టు పట్టించుకోలేదు. అంటే తెలంగాణ స్థానిక ఎన్నికలకు .. ఎస్ఈసీ యథావిధిగా ఉదయం పదిన్నరకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
మొదట పరిషత్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తారు. రెండు దశల్లో జరగనున్న ఈ ఎన్నికలకు మొదటి దశకు నామినేషన్లు గురువారం నుంచి ప్రారంభమవుతాయి. గురువారం జరిగే విచారణలో హైకోర్టు జీవోపై స్టే ఇస్తే.. ప్రక్రియ ఆగిపోతుంది. ఒక వేళ ఎన్నికల ప్రక్రియపై స్టే ఇవ్వకపోయినా.. విచారణ కొనసాగిస్తే మాత్రం రాజకీయవర్గాలు తీవ్ర గందరగోళానికి గురవుతాయి. ఎందుకంటే జీవో కొట్టివేస్తే ఎన్నికల ప్రక్రియ చెల్లదు. అంటే.. రాజకీయ నేతలు, పార్టీల ప్రయత్నాలన్నీ నిర్వీర్యం అయిపోతాయి.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన రిజర్వేషన్ల జీవో న్యాయపరమైన ఆటంకాలు దాటుతుందని ఎవరూ అనుకోవడం లేదు. చట్టాలు ఆమోదం పొందలేదు. అయినా జీవోలు ఇచ్చారు. ఇలాంటి జీవోలకు న్యాయస్థానంలో ఆమోదం పొందగలిగితే.. ఇక వెల్లువగా అనేక అంశాల్లో చట్టాల్లేకుండా జీవోలు ఇచ్చేస్తారు. అందుకే ఈ జీవో విషయంలో ఎవరికీ నమ్మకం లేదు. హైకోర్టు గురువారం స్టే విధించడమో.. సమర్థించడమో చేస్తే.. రాజకీయపార్టీలకు పెద్ద టెన్షన్ తీరిపోతుంది. లేకపోతే విచారణ జరిగింత కాలం ఉగ్గబట్టుకోవాల్సిందే.