మోహన్ బాబు యూనివర్శిటీ విద్యార్థుల నుంచి రూ. 26 కోట్లు అదనంగా వసూలు చేయడమే కాక అనేక రకాల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిందని ఉన్నత విద్యాకమిషన్ తేల్చి..గుర్తింపు రద్దు చేయాలని సిఫారసు చేసిన అంశం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ అంశంపై యూనివర్శిటీ వ్యవహారాలను చూసుకుంటున్న మంచు విష్ణు ఓ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనలో.. ఉన్నత విద్యాకమిషన్ విచారణలో తేల్చిన అంశాలను వ్యతిరేకించలేదు. తాము విచారణకు సహకరించారం కాబట్టి తమ తప్పు లేదని ఆయన సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు.
విద్యార్థుల నుంచి రూ. 26 కోట్లు అదనంగా వసూలు చేసిన విషయం ఆడిట్ రిపోర్టుల్లో కూడా వెల్లడయింది. దీనికి ఎంబీయూ అధికారులు విద్యార్థులు స్వచ్చందంగా కట్టారని చెప్పుకున్నారు. ఇలాంటివన్నీ నిజాలనీ తేల్చడంతోనే ఉన్నత విద్యాకమిషన్ సిఫారసులు చేసింది. ఆ సిఫారసులపై హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు తాత్కలికంగా స్టే ఇచ్చింది. కానీ ఈ తప్పుల నుంచి ఎంబీయూ తప్పించుకోవడం అంత తేలిక కాదని.. విద్యార్థులకు ఫీజులు వెనక్కి ఇవ్వడం సహా చాలా చర్యలకు సిద్ధం కావాల్సిందేనన్న వాదన వినిపిస్తోంది.
తన వివరణలో మంచు విష్ణు.. తమ యూనివర్శిటీకి విదేశీ వర్శిటీలతో ఉన్న ఒప్పందాలు, పలువురు విద్యార్థులకు ఉచిత విద్య, విద్యార్థులకు ప్లేస్మెంట్లు వంటి వాటిని చెప్పుకున్నారు. అవన్నీ.. నిబంధనలు ఉల్లంఘించిన దానికి మాఫీ చేసే అంశాలు కావు. మంచు విష్ణు ఉన్నత విద్యాకమిషన్ విచారణలో తేల్చిన అంశాలు అసత్యాలని చెప్పడం లేదు . కానీ సిఫారసుల్ని మాత్రం వ్యతిరేకిస్తున్నామంటున్నారు.