జూబ్లిహిల్స్ ఉపఎన్నిక బాధ్యతను కేటీఆర్కు అప్పగించారు కేసీఆర్. అందుకే హరీష్ రావు ఇప్పటి వరకూ జోక్యం చేసుకోలేదు. అయితే ఇప్పుడు హరీష్ రావు కూడా రంగంలోకి దిగారు. పార్టీ వ్యవహారాలను.. వ్యూహాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే కేసీఆర్ నుంచి హరీష్ కు సంకేతాలు వచ్చాయని..జూబ్లిహిల్స్ బాధ్యతలు చూసుకోవాలని సందేశం వచ్చినట్లుగా చెబుతున్నారు. దీంతో కేటీఆర్ తో కలిసి హరీష్ రావు.. సమావేశం నిర్వహించారు.
జూబ్లిహిల్స్ లో వార్డుల వారీగా.. బస్తీల వారీగా పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. వారందరికీ ప్రచార వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. బూత్ కమిటీలతో సమావేశం అయి.. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని సలహాలిచ్చారు. ప్రచారం చివరిరోజు వరకూ తాము అండగా ఉంటామని.. రోడ్ షోలు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. బాకీ కార్డును ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందర్నీ బీఆర్ఎస్ వైపు మళ్లించాల్సి ఉందని దిశానిర్దేశం చేశారు.
హరీష్ రావు పై కేసీఆర్కు చాలా నమ్మకం ఉంది. గతంలో ఈటల రాజేందర్ ఉపఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిగా ఉన్నప్పటికీ కేటీఆర్ కు ఆ బాధ్యత ఇవ్వకుండా హరీష్ రావుకే ఇచ్చారు. అలాగే మునుగోడుతో పాటు పలు ఎన్నికల్లో హరీష్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కేటీఆర్ కే పూర్తి బాధ్యత అప్పగించినా.. షెడ్యూల్ వచ్చే సరికి హరీష్ రావును రంగంలోకి దింపారు. హరీష్ సమర్థతపై కేసీఆర్ కు ఉన్న నమ్మకం అదని ఆయన అనుచరులు అంటున్నారు.