దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ ను మాస్క్ అడిగినందుకు వేధించి చనిపోయేలా చేసిన వ్యవహారం వైసీపీని వెంటాడుతోంది. జగన్ రెడ్డి మాకవరం పాలెం మెడికల్ కాలేజీ పరిశీలనకు వెళ్తున్న సమయంలో ఆయన వెళ్లే మార్గంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. డాక్టర్ సుధాకర్ విషయంలో చేసిన ఘోరానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నెవ్వర్ ఎగైన్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
డాక్టర్ సుధాకర్ వ్యవహారం అత్యంత వివాదాస్పదం. దళిత వైద్యుడు అయిన సుధాకర్ నర్సీపట్నం ఆస్పత్రిలో పని చేసేవారు. ఆయన కరోనా సమయంలో మాస్కులు ఇవ్వడం లేదని ఓ సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వీడియో బయటకు రావడంతో ఆయనను అత్యంత ఘోరంగా అవమానించారు. ఆయన అయ్యన్నపాత్రుడుకు సన్నిహితుడని ముద్ర వేసి .. మాస్కులు అడిగారని.. ప్రభుత్వం ఇవ్వడం లేదని నిందించారని వేధించారు. చివరికి ఆయనకు పిచ్చి అని ఆస్పత్రిలో కూడా చేర్పించారు.
విశాఖలో అప్పట్లో ఉన్న పోలీసులు పూర్తిగా దారి తప్పారు. ఆయనపై నిఘా పెట్టి ఓ సారి తన ఇంటి లోన్ చెల్లించడానికి ఓ బ్యాంకుకు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఆపి .. దుస్తులు విప్పదీసి.. చేతులు వెనక్కి కట్టి అత్యంత దారుణంగా అవమానించారు. అప్పట్లోనే దేశవ్యాప్తంగా డాక్టర్ సుధాకర్ తో వ్యవహరించిన తీరుపై దుమారం రేగింది. ఈ ఘటనపై సీబీఐ విచారణకు కూడా హైకోర్టు ఆదేశించింది. ఆ విచారణను సీల్డ్ కవర్ లో సీబీఐ సమర్పించింది. హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుందో ఎవరికీ తెలియదు.
తర్వాత సుధాకర్ చనిపోయారు. ఆయన అంత్యక్రియలు అయిపోయిన తర్వాతనే విషయం బయటకు తెలిసింది. ఇప్పటికీ డాక్టర్ సుధాకర్ ఘటన గుర్తుకు వస్తే జగన్ రెడ్డి ఎంత క్రూరత్వంతో ఉంటారో అందరికీ గుర్తుకు వస్తుంది. దళిత సంఘాలు కూడా అదే విషయాన్ని ప్రశ్నిస్తున్నాయి. ముందు డాక్టర్ సుధాకర్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. నిరసనలు వ్యక్తం చేయడంతో పాటు.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు.