రవితేజ ఫామ్ చాలా పేలవంగా ఉంది. ఆయనకు ఈమధ్య అన్నీ డిజాస్టర్లే తగులుతున్నాయి. తన తాజా చిత్రం ‘మాస్ జాతర’ ఈనెల 31న రాబోతోంది. ఓవైపు రవితేజకు హిట్లు లేవు. శ్రీలీల మ్యాజిక్ కూడా తగ్గుతూ వస్తోంది. నిర్మాతగా నాగవంశీ చేసిన ప్రయత్నాలు ఈమధ్య బాగా బెడసికొడుతున్నాయి. ఈ ముగ్గురికీ ‘మాస్ జాతర’ ఫలితం చాలా కీలకం. అయితే ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషన్ కంటెంట్ పెద్దగా మెప్పించలేదు. పాటలు కూడా సో..సో..గానేఉన్నాయి. ఇప్పుడు ట్రైలర్ కట్ పై చాలా పెద్ద బాధ్యత పడింది.
ట్రైలర్ చూసి సినిమాకు వెళ్లాలో, వద్దో డిసైడ్ అయిపోతున్నారు జనాలు. ఓపెనింగ్స్ అదరాలంటే ట్రైలర్ బాగుండాల్సిందే. ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ సినీ అభిమానులకు పెద్దగా ఎక్కలేదు. కాబట్టి ట్రైలర్‌తో అయినా మెస్మరైజ్ చేయాల్సిందే. రిలీజ్‌కు ఇంకా 20 రోజుల టైమ్ ఉంది. దీపావళి హడావుడి అయిపోయిన తరవాత ట్రైలర్ వదిలే ఛాన్స్ వుంది. రవితేజని తీసుకొచ్చి కామన్ ఇంటర్వ్యూలు చేయించి, అప్పుడే ప్రమోషన్లు మొదలెట్టేశారు. ఇప్పుడు ఎంత చేసినా, చివరి వారంలో చేసిన ప్రమోషన్లే కీలకం. నాగవంశీకి సైతం ఈ విషయం తెలుసు. తన సినిమాని ఆయన బాగానే ప్రమోట్ చేసుకొంటారు. నాగవంశీ ఓ ఇంటర్వ్యూ ఇచ్చినా, ప్రీ రిలీజ్ లో స్పీచు దంచి కొట్టినా ప్రమోషన్లకు బాగా ఉపయోగపడుతుంది. కాకపోతే… ‘కింగ్ డమ్’, ‘వార్ 2’ ఫలితాల నేపథ్యంలో నాగవంశీ ఇదివరకటిలా ఎగ్రసీవ్ గా మాట్లాడతారా? అనే అనుమానం మొదలైంది. ఆయన వచ్చి హైప్ ఎక్కిస్తే కానీ… మాస్ జాతరకు బజ్ వచ్చేలా లేదు. కాబట్టి ఆయన రంగంలోకి దిగాల్సిందే.