వంద కోట్లు ఉంటే ఎంత మెట్రో సిటీలో అయినా విల్లా కొనుక్కోవచ్చని అనుకుంటారు. కానీ అన్ని చోట్లా సాధ్యం కాదు. వంద కోట్లకు అపార్టుమెంట్ రావడం కూడా కష్టంగా మారుతోంది. ముంబైలో అయితే మరీ ఎక్కువ. గురుగ్రామ్‌తో పోటీపడి ముంబై అపార్టుమెంట్ ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి.
ముంబైలో వర్లీ సీ-ఫేస్‌లోని నమన్ జానా టవర్‌లో ఓ అపార్టుమెంట్ ను రూ. 700 కోట్లకు అమ్మారు. యూఎస్వీ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ లీనా గాంధీ తివారీ సీ కార్నర్ డబుల్డ్యూప్లెక్స్లను రూ. 639 కోట్లకు కొనుగోలు చేశారు. స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ వంటి పన్నులతో కలిపి మొత్తం లావాదేవీ రూ.703 కోట్లకు చేరింది. ఇది దేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యధిక విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్‌గా చరిత్రలో నిలిచింది.
నమన్ జానా టవర్‌లో 32వ నుంచి 35వ అంతస్తుల వరకు విస్తరించిన డబుల్డ్యూప్లెక్స్లు మొత్తం 22,572 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి చదరపు అడుగుకు సగటు ధర రూ. 2.83 లక్షలకు పైగా ఉండటంతో, ఇది ముంబై లగ్జరీ మార్కెట్లో కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్రాజెక్టును అర ఎకరం కంటే కాస్త ఎక్కువ అయిన స్థలంలోనే నిర్మించారు. 150 మీటర్ల ఎత్తుతో నిర్మించారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 22 ఎక్స్‌క్లూజివ్ రెసిడెన్స్‌లు మాత్రమే ఉన్నాయి. 11 పార్కింగ్ లెవెల్స్, వరల్డ్-క్లాస్ అమెనిటీస్ తో కూడిన గ్రాండ్ పోడియం, ఎకో-ఫ్రెండ్లీ ఆర్కిటెక్చర్, స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ డీల్ ముంబై హై-ఎండ్ రెసిడెన్షియల్ మార్కెట్ బలాన్ని తెలియజేస్తోంది. నమన్ జానా 0.64 ఎకరాలను రూ. 260 కోట్లకు కొనుగోలు చేసి.. అపార్టుమెంట్ నిర్మిస్తోంది. కానీ సేల్స్ పొటెన్షియల్ ₹3,500 కోట్లకు పైగా ఉంది. ఇది డెవలపర్లకు 13 రెట్లు రిటర్న్‌ను అందిస్తోంది.