‘లవ్ టుడే’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొన్నాడు ప్రదీప్ రంగనాథ్. ప్రేమలు సినిమాలతో కుర్రాళ్ల మనసుల్ని గెలుచుకొంది మమిత బైజూ. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా.. ‘డ్యూడ్’. ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రదీప్ రంగనాథ్ సినిమాలకు తెలుగులో ఫ్యాన్స్ ఎక్కువయ్యారు. ‘డ్యూడ్’ మైత్రీ మూవీస్ బ్యానర్లో వస్తున్న సినిమా. కాబట్టి కచ్చితంగా కుర్రాళ్ల దృష్టి ఈ సినిమాపై పడే ఛాన్స్ పుష్కలంగా ఉంది. ఈరోజు ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ మొత్తం ప్రదీప్ వన్ మ్యాన్ షోనే. తన అల్లరి, వేసే వేషాలు, ఇచ్చే కటింగులు, మేనరిజం, స్టైల్.. ఇవన్నీ పక్కాగా కుర్రాళ్లకు నచ్చేలా వుంది. ఈ మోడ్రన్ దేవదాసు పాత్రకు కుర్రాళ్లు బాగా కనెక్ట్ అవుతారని చిత్రబృందం ధీమాగా ఉంది. ట్రైలర్ లోనూ ఆ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
మమిత బైజూ క్యారెక్టరైజేషన్ కూడా కొత్తగా అనిపిస్తోంది. బ్రేకప్ చెప్పి వెళ్లిపోయిన అమ్మాయి కోసం… హీరో ఏం చేశాడన్న కాన్సెప్ట్ కొత్తగానే ఉంది. యూత్ రిలేటెడ్ అంశాలు బాగా మేళవించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమైపోతోంది. ట్రైలర్ కూడా చాలా ఫాస్ట్ ఫేజ్ లో కట్ చేశారు. శరత్ కుమార్ పాత్ర కూడా ఇంట్రస్టింగ్ గానే ఉంది. ఫన్ తో పాటు గా ఎమోషన్ కూడా వర్కవుట్ అయితే… డ్యూడ్ నిలబడిపోవొచ్చు. పైగా సినిమాలకు మహారాజా పోషకులు కుర్రాళ్లే. వాళ్లకు నచ్చితే సినిమా హిట్. కేవలం కుర్రాళ్లని దృష్టిలో ఉంచుకొనే ఈ ట్రైలర్ కట్ చేసినట్టు అర్థం అవుతోంది. కాకపోతే… అసభ్యత, డబుల్ మీనింగ్ డైలాగులు, హాట్ సీన్లూ ఏవీ లేకుండా జాగ్రత్త పడ్డారు. కీర్తీశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని సమకూర్చారు. 17న థియేటర్లలోకి రానుంది. అంతకంటే ముందు… ప్రీమియర్లు ప్రదర్శించే అవకాశం ఉంది.