తెలంగాణ వ్యాప్తంగా 2,620 కొత్త రిటైల్ మద్యం దుకాణాలకు లైసెన్సుల దరఖాస్తు ప్రక్రియలో ఆశించిన స్పందన లభించడం లేదు. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 18 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. మరో వారంలో గడువు ముగుస్తున్నా ఇప్పటి వరకు కేవలం 2,000 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. 2023లో 98,900 దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో అప్లికేషన్ ఫీజు రూ. 2 లక్షలు కావడంతో 2,600 కోట్లు ఆదాయం వచ్చింది.
ఈ సారి మాత్రం పెద్దగా స్పందన లేకపోవడం ఎక్సైజ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. 2025-27 సంవత్సరాలకు 2,620 మద్యం దుకాణాలకు అప్లికేషన్లు ఆహ్వానిస్తున్నారు. అక్టోబర్ 23న లాటరీ పద్ధతిలో కేటాయింపు జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో 94 వైన్ షాపులకు ఇప్పటి వరకూ పదిలోపే దరఖాస్తులు వచ్చాయి. అధికారుల అంచనాల ప్రకారం, దరఖాస్తు సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం దరఖాస్తు రుసుము పెంపుగా భావిస్తున్నారు. గతంలో రూ. 2 లక్షలుగా ఉన్న ఫీజుని ఈ సారి రూ. 3 లక్షలకు పెంచారు. ఇది నాన్ రిఫండబుల్. అక్టోబర్ 18తో దరఖాస్తు గడువు ముగియనుంది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోతే ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం పడుతుంది.
అయితే మద్యం వ్యాపారులు ఎప్పుడూ ప్రణాళికలతో ఉంటారని.. దరఖాస్తు ల గడువు చివరి రెండు, మూడు రోజుల్లోనే అప్లికేషన్లు దాఖలు చేస్తారని అంటున్నారు. ఎందుకంటే ఎక్కడ తక్కువ పోటీ ఉంటుందో చూసుకుని అక్కడ వేస్తారు. ఇపుడే డిమాండ్ లేదని చెప్పడం సరి కాదని.. అప్లికేషన్ ఫీజు పెంచడం కాస్త ప్రభావం చూపుతోంది కానీ.. అసలు దుకాణాల కోసం ఆసక్తి చూపించకపోవడం ఉండదని అంటున్నారు.