స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. దీంతో మండల్ కమిషన్ లాంటి ఉద్యమం తెస్తామని ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. తీన్మార్ మల్లన్న బంద్కు పిలుపునిస్తామన్నారు. ఇతర నేతలూ స్పందించారు. రాజకీయ పార్టీలు .. ఒకరిపై ఒకరు నిందలేసుకున్నాయి. రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేశారని హరీష్ రావు ఆరోపించారు. అసలు బీఆర్ఎస్ చేసిన చట్టం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని భట్టి విక్రమార్క ప్రెస్మీట్ పెట్టి ఆరోపించారు. ఎవరి రాజకీయం వారిదే. నిజంగా బీసీలు ఏమనుకుంటున్నారు ?
రాజకీయ ఆయుధంగా మారిన బీసీలు
బీసీ సామాజికవర్గానికి చెందిన వారు తెలంగాణలో యాభై శాతానికిపైగా ఉన్నారని కులగణన రిపోర్టులో తేల్చారు. వారి మద్దతు ఉంటే తిరుగులేని విధంగా అధికారాన్ని చెలాయించవచ్చని అనుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చిన రేవంత్ దాన్ని అమలు చేసేందుకు ఉన్న మార్గాలన్నీ ప్రయత్నించారు. కానీ అలా అమలు చేయడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం రాజ్యాంగ సవరణ. అలా చేయాలంటే కేంద్రంలో రాహుల్ ప్రధాని కావాలి. ఇప్పుడు కాలేదు. అందుకే అవకాశం లేదు. కానీ రేవంత్ ఇచ్చిన హామీని ఎలాగోలా అమలు చేయాలని .. లేని దారులతో ప్రయత్నిస్తున్నారు . అది మరింత పీటముడికి కారణం అవుతోంది.
కాంగ్రెస్ ప్రయత్నాలు ఆర్గానిక్ అని బీసీలు నమ్ముతారా?
బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఆర్గానిక్ అని బీసీలు నమ్ముతారా అన్న ప్రశ్నపైనే ఇప్పుడు ఆ పార్టీకి ఆదరణ ఉంటుందా.. వారంతా వ్యతిరేకమవుతారా అన్నది తేలాల్సి ఉంది. రిజర్వేషన్లు సాధ్యం కాదనుకున్నప్పుడు ఏదో విధంగా ప్రజలకు సర్దిచెప్పాలి. వీలైనంత వరకూ ఆ ప్రయోజనాలు అందించే ప్రయత్నం చేయాలి. కానీ చెల్లని జీవోలతో పోరాటం చేస్తే ప్రయోజనం కష్టం. కాంగ్రెస్ ఇచ్చిన జీవో చెల్లుతుందని కనీస అవగాహన ఉన్న ఒక్కరు కూడా చెప్పలేరు. స్వయంగా రేవంత్ కూడా బీసీల రిజర్వేషన్లను కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించిన తర్వాత జీవోలతో ఎలా ఇచ్చేస్తారని ప్రజలు అనుకుంటారు ?. అయితే తమ ప్రయత్నాల్లో చిత్తశుద్ధి ఉందని కాంగ్రెస్ నేతలు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రజలు నమ్ముతారా లేదా అన్నదానిపైనే తదుపరి పరిణామాలు ఉంటాయి.
లేనిపోని వివాదాన్ని పెద్దది చేసుకోవడమే !
రిజర్వేషన్ల రాజకీయాలు ఎప్పటికైనా రివర్స్ అవుతాయి. కులగణన వల్ల కాంగ్రెస్ పార్టీకి మైలేజీ వచ్చిందో.. మైనస్ అయిందో అంచనా వేయడం కష్టం. బీసీలు సమాన అవకాశాలు కోరుతున్నారు. రాజకీయ పరంగా అవకాశాలు కోరుతున్నారు. రిజర్వేషన్ల పేరుతో వారిని రెచ్చగొట్టడం మాత్రం.. రివర్స్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ అంశాన్ని చాలా అంటే చాలా పెద్దదిగా చేసుకుంది. బీసీలు కాంగ్రెస్ ను ఎలా చూస్తారన్నదే ఆ పార్టీకి కీలకం. తేడా వస్తే చాలా నష్టపోవాల్సి ఉంటుంది.