ఆంధ్రప్రదేశ్ లో నకిలీ మద్యం తయారీ వ్యవహారం సంచలన మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా ఆఫ్రికా నుంచి పక్కా ప్రణాళికతో ప్రారంభించిన కుటీర పరిశ్రమగా అనుమానాలు ప్రారంభమవుతున్నాయి. ప్రధాన నిందితుడు అయిన అద్దేపల్లి శ్రీనివాసరావుకు ఎలాంటి అనారోగ్యం లేదు. వైద్యం కోసం ఆయన దక్షిణాఫ్రికా ఆస్పత్రికి వెళ్లలేదు. ఆఫ్రికాలో కల్తీ లిక్కర్ వ్యాపారం గురించే వెళ్లారు. ఇప్పుడు ఆయన విజయవాడకు వచ్చి అరెస్ట్ అయ్యారు. ఇక నుంచి అసలు విషయం బయటకు వస్తుందని భావిస్తున్నారు.
రెడ్డీస్ గ్లోబల్ ఫార్ములాతోనే తయారీ !
ఆఫ్రికా దేశాల్లో రెడ్డీస్ గ్లోబల్ పేరుతో మద్యాన్ని విక్రయించే కంపెనీ అక్కడ పెద్ద పెద్ద డిస్టిలరీలు ఏర్పాటు చేయలేదు. చిన్న చిన్న ఇళ్లల్లో చీప్ లిక్కర్ తయారు చేసి అమ్మేవారు. కొద్దిగా యంత్ర సామాగ్రి.. చిన్న డ్రమ్ములతో పని పూర్తి చేసేవారు. అక్కడ అధికారులు దాడులు చేసినప్పుడు అవే బయటపడ్డాయి. ఇప్పుడు ములకల చెరువులోనూ అదే బయటపడింది. అంటే సేమ్ ఫార్ములాతో అక్రమ మద్యం తయారీకి తంబళ్లపల్లెలో ప్లాన్ చేశారు. తంబళ్లపల్లెకు పెద్దిరెడ్డి సోదరుడు ఎమ్మెల్యే. అక్కడ ఏం జరుగుతుందో బయటరాకుండా చేయగలరు.
చాలా పెద్ద స్థాయిలో కల్తీ మద్యం తయారీకి ప్లాన్
ఆఫ్రికాలో అక్రమ మద్యం వ్యాపారానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. అక్కడి ప్రజలు చచ్చిపోతున్నారని అక్కడి ప్రభుత్వాలు బ్యాన్ చేశాయి. అదే సమయంలో వ్యతిరేక ప్రచారం జరుగుతోంది. ఆ మద్యం వ్యాపారాలను, తయారీని నిషేధించడాన్ని అక్కడ ప్రజలు స్వాగతిస్తున్నారు. దాంతో ఆ ఘోరాలను ఏపీకి తీసుకు వచ్చి తమ పని పూర్తి చేయాలనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అక్కడి నుంచే ఫార్ములాను తీసుకు వచ్చి.. అవే యంత్రాలను తీసుకు వచ్చి ఇక్కడ కల్తీ లిక్కర్ ప్రారంభించారు. ప్రారంభంలోనే దొరికిపోయారు కాబట్టి సరిపోయింది లేకపోతే.. పెద్ద ఎత్తున అమ్మకాలకు పాల్పడి ఉండేవారు.
సూత్రధారులు బయటపడితే సంచలనం
దొరికిపోయాక..దొంగే దొంగ దొంగా అని అరవడంలో రాటుదేలిపోయిన రాజకీయ ప్రతిపక్షం ఏపీలో ఉంది. ఇలాంటి ఘోరమైన ఆలోచనలు అన్నీ వారికే వస్తాయి. అసలు సూత్రధారులు ఎవరో ఇప్పుడు పోలీసులు బయట పెట్టనున్నారు. విదేశాల్లో చేసిన దందాలతో సహా అన్నీ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్రమ వ్యాపారాలకు అలవాటు పడి ప్రభుత్వం మారినా.. ఏదో ఓ విధంగా దందా చేసుకోవడానికి పన్నిన కుట్ర ఇదని స్పష్టత వస్తోంది. త్వరలోనే పోలీసులు అన్నీ తేల్చనున్నారు.