ఆంధ్రప్రదేశ్ మరో భారీ పెట్టుబడిని రాబట్టింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ఆంధ్రప్రదేశ్ లో 11 బిలియన్ల్ డాలర్లు అంటే దాదాపుగా లక్ష కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రామాయపట్నం వద్ద రోజుకు 1,80,000 నుంచి 2,40,000 బారెల్స్ ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగిన కొత్త గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ , పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్‌ను నిర్మి్స్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌కు 6,000 ఎకరాల భూమిని కేటాయించింది. వెంటనే నిర్మాణాలు ప్రారంభించి జనవరి 2029 నాటికి వాణిజ్య ఆపరేషన్లు ప్రారంభించనున్నారు.
BPCL, భారతదేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ సంస్థ. ప్రస్తుతం ముంబై, కొచ్చి, బిహార్‌లోని మూడు రిఫైనరీల ద్వారా 7,06,000 బ్యారెల్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కొత్త ప్రాజెక్ట్ దేశ రిఫైనింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచి, పెట్రోకెమికల్స్ ఉత్పత్తుల డిమాండ్‌ను తీర్చడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం కేటాయిస్తున్న భూమిలో కోర్ రిఫైనరీ ఆపరేషన్లకు 3,352 ఎకరాలు, టౌన్షిప్, గ్రీన్ బెల్ట్, ఇతర సహాయక సదుపాయాలకు మిగిలిన భూమి వినియోగిస్తారు.
రిఫైనరీతో పాటు పెట్రోకెమికల్స్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తారు, ఇది డౌన్‌స్ట్రీమ్ ఇండస్ట్రీలకు ఆధారంగా మారుతుంది. విద్యుత్ అవసరం 600 MW, దీనిలో 100 MW ఇన్-హౌస్ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేసుకుంటారు. BPCL ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేసి, విదేశీ భాగస్వాములతో చర్చలు ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం BPCLకు 20 సంవత్సరాల పాటు ప్రాజెక్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో 75 శాతం ప్రోత్సాహకాలు ఇస్తుంది. ఈ పెట్టుబడి లక్షలాది ఉద్యోగాలు సృష్టించి, బాండ్ రేటింగ్లను మెరుగుపరుస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. BPCL గ్రీన్ ఎనర్జీ , జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్రమాణాలను అమలు చేస్తామని హామీ ఇచ్చింది.
ఇటీవల రామాయపట్నంవద్ద షిరిడిసాయి ఎలక్ట్రికల్స్ కు ఇచ్చిన భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుని ఇతర చోట్ల భూసేకరణకు అవకాశం కల్పించింది. అలా చేయడంపై కొంత మంది విమర్శలు చేశారు. కానీ ప్రభుత్వం బీపీసీఎల్‌కు కేటాయించడానికే ఇలా చేసిందని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బీపీసీఎల్ రాకపోతే రామాయపట్నం పోర్టుకు డిమాండ్ పెరుగుతుంది. ఎన్నో అనుబంధ పరిశ్రమలు ఏర్పడతాయి. ఇది ఏపీ పారిశ్రామిక రంగంలో గేమ్ ఛేంజర్ అనుకోవచ్చు.