రిజర్వేషన్ల జీవోపై స్టే ఇచ్చిన తెలంగాణ హైకోర్టు స్థానిక ఎన్నికలను నిర్వహించుకునేందుకు ఒక్క షరతు మీద అంగీకారం తెలిపింది. తాజాగా తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చింది. తీర్పులో 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టుకోవచ్చని తెలిపింది. పెంచిన 17 శాతం రిజర్వేషన్లు ఓపెన్ కేటగిరీగా మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి సూచనలు చేసిన హైకోర్టు చీఫ్ జస్టిస్ .. జీవో జారీ చేయడంలో సుప్రీంకోర్టు నిబంధనలు అన్నీ ఉల్లంఘించిందని వ్యాఖ్యానించారు.
ఇప్పుడు ఈ తీర్పు విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కేబినెట్ లో నిర్ణయించి .. హైకోర్టు సూచించిన విధంగా 17 శాతం రిజర్వేషన్లను ఓపెన్ గా మార్చి.. పార్టీ పరంగా మాత్రం మొదట ఇచ్చిన జీవో లెక్కల ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేసి ఎన్నికలకు వెళ్లాలా లేకపోతే ..సుప్రీంకోర్టులో ఫైట్ చేయాలా అన్నదానిపై నిర్ణయించనున్నారు. ప్రాథమికంగా సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు.
సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోతే.. ఇక న్యాయపరంగా కూడా పోరాటం చేస్తున్నామని కానీ.. ఊరట లభించడం లేదు కాబట్టి.. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పి ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారు. అదే సమయంలో తమ ప్రయత్నాలు చిత్తశుద్ధితోనే ఉన్నాయని ప్రజలకు నిరూపించుకోవాల్సిన అవసరం పడింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా వెళ్లకపోయినా.. పార్టీ పరమైన రిజర్వేషన్లతో ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నాయి సూచనలు కనిపిస్తున్నాయి.