తెలంగాణలో బీసీ రాజకీయం ఓ రేంజ్ లో నడుస్తోంది. మేము బీసీ రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నామని కాంగ్రెస్ హడావుడి చేస్తోంది. మోసం చేయడానికే జీవోల పేరుతో హడావుడి చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. కానీ రిజర్వేషన్ల జీవో కోర్టు వరకూ వెళ్లింది. బంద్ చేస్తామని ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఆయన నేతృత్వంలో ఓ జేఏసీ కూడా ఏర్పడింది. ఈ వ్యవహారంపై అంతా రాజకీయమే జరుగుతోంది కానీ.. నిజంగా బీసీల్లో ఎలాంటి స్పందన ఉందో ఎవరూ పట్టించుకోవడంలేదు. అంత అవసరం ఉందని కూడా ఏ పార్టీ అనుకోవడం లేదు. మరి నిజంగా బీసీల్లో ఈ అంశంపై స్పందన ఉందా.. వారిలో సెంటిమెంట్ ను సృష్టించగలిగారా అనేది మాత్రం సందేహంగా మారింది.
స్థానిక ఎన్నికల్లోనే రిజర్వేషన్ల జీవో
ప్రభుత్వం ఇచ్చిన జీవో స్థానిక ఎన్నికలకు ఉద్దేశించిందే. అంటే రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే. విద్య, ఉద్యోగాల్లో కాదు. ఈ జీవోను సమర్థంగా అమలు చేస్తే తర్వాత వాటిలోనూ అమలు చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ జీవో విషయంలో ప్రజలకు ఓ అవగాహన ఉంది. ఇది న్యాయపరమైన ప్రక్రియ కాదని వారికి తెలుసు. పైగా అది ఎన్నికలకు సంబంధించినది. నేరుగా స్థానిక ఎన్నికలకు సంబంధం ఉన్న బీసీలు తక్కువ. విద్య, ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో ఈ రాజకీయం జరుగుతూంటే వారు స్పందించేవారు. కానీ ఇప్పుడు రాజకీయం కోసం జరుగుతోంది కాబట్టి పెద్దగా పట్టించుకోవడంలేదు.
పొలిటికల్ ట్రాప్ లో పడటానికి సిద్ధంగా లేని బీసీలు
రాజకీయ నేతలు .. రాజకీయ లబ్ది కోసం తమను రోడ్లకు లాగేందుకు పొలిటికల్ ట్రాప్ వేస్తున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు. బంద్ లు..నిరసనల పిలుపు ఈ కోవలోకే వస్తుంది. ఇష్టం వచ్చినట్లుగా రాజకీయ పార్టీలు మారి.. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీని బీసీల చాంపియన్ గా ప్రకటించే ఆర్ కృష్ణయ్య లాంటి వారు ఎప్పుడో బీసీల విశ్వాసాన్ని కోల్పోయారు. ఆయన పిలిస్తే రోడ్ల మీదకు వచ్చే పరిస్థితి లేదు. అలాగే మేము రిజర్వేషన్లు ఇస్తామంటే నమ్మడానికి కూడా సిద్ధంగా లేరు. కానీ ఈ రాజకీయాన్ని మాత్రం ఓ కంటితో కనిపెడుతూనే ఉన్నారు. తమ సెంటిమెంట్లతో రాజకీయం చేసే వారిని వారు గుర్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయి.
బీసీల్లో కదలిక తీసుకురాలేకపోయిన బీసీ రాజకీయం
బీసీ రాజకీయం ద్వారా బీసీల్లో కదలిక తీసుకు వచ్చి రాజకీయంగా లబ్దిపొందాలని అనుకున్నారు. అందుకే రిజర్వేషన్లు అడ్డుకుంటున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ధర్నాలు కూడా .. కూడా చేసింది. కానీ అసలు మోసం చేస్తోంది కాంగ్రెస్సేనని ఇతర పార్టీలు అంటున్నాయి. కానీ ప్రజలు ముఖ్యంగా బీసీ వర్గం ప్రజలు మాత్రం అందరూ కలిసి తమను మోసం చేస్తున్నారని ఓ నిర్ణయానికి వస్తున్నారు. అందుకే పూర్తిగా ఈ రాజకీయాన్ని పట్టించుకోవడంలేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నాయి.