బీహార్ లో ప్రశాంత్ కిషోర్ తన రాజకీయ స్ట్రాటజిక్ తెలివితేటలు పక్కాగా ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు బీహార్ లో మద్యనిషేధం అమల్లో ఉంది. కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుంది. ఇలాంటి మద్యనిషేధం అక్కర్లేదని జన సురాజ్ పార్టీని గెలిపిస్తే మద్య నిషేధం ఎత్తివేస్తానని ప్రశాంత్ కిషోర్ హామీ ఇచ్చారు. ఈ హామీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
బీహార్‌లో 2016 నుంచి మద్యనిషేధం అమల్లో ఉంది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన గంటలోపు ఎత్తేస్తామని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు. మద్యనిషేధం వల్ల బీహార్‌కు వార్షికంగా రూ. 28,000 కోట్ల ఆదాయ నష్టం జరుగుతోందని .. మద్యనిషేధం ఎత్తేస్తే ఈ డబ్బును అభివృద్ధికి , యువత ఉద్యోగాలకు వాడుకోవచ్చని అంటున్నారు. ఇలా చేయడం ద్వారా వరల్డ్ బ్యాంక్ & IMF నుంచి రూ. 5-6 లక్షల కోట్ల రుణాలు సేకరించి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ వంటి వాటికి ఉపయోగిస్తామని ప్రశాంత్ కిషోర్ చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ ఆదాయం అంతా దొంగ సారా వ్యాపారులకు, అక్రమ మద్యం వ్యాపారులకు చెందుతోందని .. మద్య నిషేధం అనేది పేపర్ పై మాత్రమే ఉందంటున్నారు. బ్లాక్ లో అక్రమంగా మద్యం అమ్ముతూండటంతో మందుబాబులు ఎక్కువగా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది. వారు కూడా మద్య నిషేధం ఎత్తివేతకు సానుకూలంగా స్పందిస్తున్నారు. మద్యం అలవాటు ఉన్న నిరుపేదల కుటుంబాలు కూడా మద్యం అందుబాటులోకి తెస్తేనే మంచిదని అనుకుంటున్నారు. ఈ అభిప్రాయాలను గట్టిగా పరిగణనలోకి తీసుకున్న ప్రశాంత్ కిషోర్… మద్యనిషేధం ఎత్తివేతను “ఆర్థిక విప్లవం”గా ప్రచారం చేస్తున్నారు.
ఇతర పార్టీలు మద్యం నిషేదం ఎత్తివేస్తామని చెప్పలేకపోతున్నాయి. బీజేపీ, జేడీయూ మద్యనిషేధాన్ని కొనసాగిస్తామని చెబుతున్నాయి. తేజస్వీ యాదవ్ కూడా ఎత్తివేస్తామని చెప్పలేకపోతున్నారు. ప్రశాంత్ కిషోర్ మద్యనిషేధ ఎత్తివేత ప్రకటనపై ఈ రెండు పార్టీలు స్పందించలేకపోతున్నాయి. మందుబాబుల్లోకి తన మద్యనిషేధ ఎత్తివేత హామీని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి.. బలమైన ఓటు బ్యాంక్ సాధించాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.