అభిమానులంతా రౌడీ అని పిలుచుకొనే హీరో విజయ్ దేవరకొండ. తన తమ్ముడు.. ఆనంద్ దేవరకొండ కూడా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నవాడే. అడపా దడపా సినిమాలు చేస్తున్నాడు. ఈమధ్య సినిమాలు చేయడం తగ్గించేశాడు. తన సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. తన సినిమా సంగతులు కూడా పెద్దగా బయటకు రావడం లేదు. అయితే కాస్త గ్యాప్ తరవాత ఓ కథ ఓకే చేసినట్టు టాక్. `మిడిల్ క్లాస్ మెలోడీస్`తో తనకు మంచి హిట్టు ఇచ్చిన వినోద్ తో మరోసారి జట్టు కట్టడానికి రెడీ అయ్యాడని తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ అమేజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయ్యింది. మంచి ఆదరణ తెచ్చుకొంది. ఇప్పుడు మరోసారి వీళ్ల కాంబోలో సినిమా రావడానికి రంగం సిద్ధమైంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ లానే మరో సహజమైన కథ ని వినోద్ రెడీ చేశాడని, దాదాపు స్క్రిప్టు లాక్ అయిపోయిందని, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లుందని సమాచారం.
అయితే ఇది థియేట్రికల్ సినిమా కాకపోవొచ్చు. నెట్ ఫ్లిక్స్ కోసం చేస్తున్న ప్రాజెక్ట్ అని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మిడిల్ క్లాస్ మెలోడీస్ కూడా ఓటీటీ కోసం చేసిన సినిమానే. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కోసం ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఓటీటీ ఎక్స్ క్లూజీవ్స్ చేయడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. ఫలితాలు పెద్దగా ఎఫెక్ట్ చేయవు. హిట్టయితే అవకాశాలు ఆగవు కానీ, ఫ్లాప్ వల్ల డామేజ్ పెద్దగా జరగదు. బడ్జెట్లు ముందే లాక్ అయిపోతాయి కాబట్టి, నిధుల కొరతతో సినిమా ఆగిపోయే ప్రమాదం ఉండదు. కాబట్టే నవతరం దర్శకులు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ వైపు చూస్తున్నారు.