తెలంగాణ రాజకీయాల్లో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి పెద్దగా ఆసక్తి చూపని కేటీఆర్ .. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆయన ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ అందు కోసం ఆయన అనుసరిస్తున్నవన్నీ రాహుల్ గాంధీ విధానాలే. కేటీఆర్ వ్యవహారం చూసి అరె.. అచ్చం రాహుల్ గాంధీలాగే చేస్తున్నారే అనే బీఆర్ఎస్ నేతలు కూడా ఆశ్చర్యపోతున్నారు.
జూబ్లిహిల్స్ లో ఓట్ల చోరీ ఆరోపణల వ్యూహం
జూబ్లిహిల్స్ లో ఓట్ల చోరీ అంశాన్ని కేటీఆర్ తెరపైకి తెచ్చారు. మొదట ఈసీకి ఫిర్యాదు చేశారు. తర్వాత పార్టీ నేతలు ఆరోపణలు చేశారు. తాను స్వయంగా పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టారు. 23 వేల ఓట్లు రెండేళ్లలో పెరిగాయని ఆరోపించారు. ఓటర్లకు తెలియకుండానే ఇతర ప్రాంతాల్లోని వారిని ఓటర్లుగా చేర్చారని ఆరోపించారు. అచ్చం రాహుల్ గాంధీ లాగానే ..కొన్ని వీడియోలు ప్రదర్శించారు. సిరిసిల్ల ఓటర్ కు జూబ్లిహిల్స్ లో ఓటు ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఓటర్ జాబితాలో అవకతవకల్ని రాహుల్ ఎలా చూపించారో.. తాను ఎమ్మెల్యే అయిన సిరిసిల్ల నుంచి ఓ ఓటర్ సాక్ష్యాన్ని కేటీఆర్ తీసుకు వచ్చి చూపించారు.
ఓటమికి కారణాలు చెబుతున్నట్లుగా ఉన్నాయని సెటైర్లు
ఓటర్ల జాబితాలో అవకతవకలపై చర్యలు తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. అంటే ఎన్నికను ఆపేయాలన్నది ఆయన వ్యూహం. పూర్తిగా ఓటమి భయంతో.. ఓటమి కారణాలు చెప్పేందుకు ఈ వివాదం ఎంచుకున్నారన్న సెటైర్లు ఇతర పార్టీల నుంచి నుంచి వస్తున్నాయి. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన అంశాలపై జిల్లా ఎన్నికల శాఖ అధికారి ఫ్యాక్ట్ చెక్ చేశారు. కొత్తగా ఓట్లు నమోదు కాలేదని.. అవన్నీ గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉన్న ఓట్లేనని స్పష్టం చేశారు. అయినా కేటీఆర్ తన ప్రచారం తాను కొనసాగిస్తున్నారు.
బీజేపీని మెప్పించగలరు కానీ.. ప్రజల నమ్మకం కోల్పోతారు !
కేటీఆర్ ఈ ఎన్నికలలోనూ బీజేపీని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటాన్ని తెలంగాణ ద్వారా నిర్వీర్యం చేయడానికి ఆయన బీజేపీకి సహకరిస్తున్నట్లుగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందని జనరలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని.. ఇది బీజేపీ కోణంలోనే ఉందని అనుకునే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ.. ఈ ఎన్నికపై నిర్లక్ష్యంగా ఉంది. అది బీఆర్ఎస్కు సహకరించడానికేనన్న ప్రచారమూ ఉంది. అది నిజమే అయితే బీఆర్ఎస్కు మేలు జరగకపోగా నష్టం చేసే అవకాశాలు ఉన్నాయి.