నకిలీ మద్యం కేసులో తనను ఇరికిస్తున్నారని జోగి రమేష్ చెప్పుకొస్తున్నారు. ఆయనకు మద్దతుగా వైసీపీ నేతలను సజ్జల రంగంలోకి దింపుతున్నారు. వైసీపీ ఆఫీసు నుంచి స్క్రిప్టులు పంపించి … అద్దేపల్లి జనార్దన్ రావును బెదిరించి వీడియోలు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలా చెప్పించాలని అనుకుంటే నేరుగా జగన్ రెడ్డి పేరునో.. కుట్ర సిద్ధాంత నిపుణుడు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి పేరునో చెప్పించేవారు కదా.
గతంలో అసలు లీక్ కాని టెన్త్ పేపర్ కేసులో ఓ నారాయణ స్కూల్ చిరుద్యోగిని పట్టుకుని నాతో నేరుగా నారాయణ మాట్లాడతాడు.. పేపర్ లీక్ చేయమని ఆయనే చెప్పాడు అని అప్పటి ఎస్పీ రిషాంత్ రెడ్డి వాంగ్మూలం తీసుకున్నారు. నారాయణ ఫోన్ ట్యాపింగ్ చేసి హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. అసలు నారాయణ స్కూళ్లు, కాలేజీల నిర్వహణను ఎప్పుడో వారసులకు అప్పగించారు. రోజువారీ వ్యవహారాలను ఆయన పట్టించుకోరు. అయినా సరే నారాయణను అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో తప్పుడు వాంగ్మూలం ఇప్పించుకుని అరెస్టు చేశారు. నారాయణ ఆ ఉద్యోగితో మాట్లాడారన్న దానికి కానీ.. మరో విషయంలో కానీ చిన్న ఆధారం కూడా లేదు. అదీ ఫేక్ వాంగ్మూలం, బెదిరించి వీడియో తీయించుకోవడం అంటే.
ఇప్పుడు అద్దేపల్లి జనార్దన్ రావు జోగి రమేషే ఈ కుట్ర తనతో చేయించాడని చెప్పడానికి అవసరమైన అన్ని సాక్ష్యాలను ఇస్తున్నారు. ఎక్కడ ములకల చెరువు.. ఎక్కడ ఇబ్రహీంపట్నం…. ఈ లింక్ జోగి రమేష్ కు ఎలా తెలిసింది.. ఎలా కలిసింది?. అసలు అద్దేపల్లి ఎవరో తనకు తెలియదంటాడు ఓ సారి.. మా తాత, వాళ్ల తాత ఫ్రెండ్స్ అంటాడు ఇంకోసారి.. తెలుసు కానీ ఫ్రెండ్స్ కాదంటాడు. కానీ నిజం మాత్రం.. సారా వ్యాపారంలో వీరు భాగస్వాములు. జోగి రమేష్ ఇంటి సీన్ ఫుటేజీలను ఇవ్వరు. ఫోన్లను ఇస్తానని మీడియా ముందు షో చేస్తారు. కానీ ఆయన వాడే ఫోన్లు ఒకటి కాదని అందరికీ తెలుసు. పోలీసులు అద్దేపల్లితో చెప్పించాలనుకుంటే.. జోగి రమేష్ పేరే ఎందుకు చెప్పిస్తారు?
ఆ కుట్ర మొత్తం జోగి రమేష్ కనుసన్నల్లో జరిగింది కాబట్టి చెప్పారు. చెప్పించాలనుకుంటే.. జగన్ పేరో సజ్జల పేరో చెప్పించుకుని ఉండేవారు. కుట్రలు చేసి తప్పించుకుందామని జోగి రమేష్ లాంటి వాళ్లు అనుకుంటే అంత కంటే పెద్ద అమాయకత్వం ఉండదేమో ?. ఇలాంటి కుట్రలకు ఎలాంటి ట్రీట్మెంట్ కరెక్టో అలాంటిదే ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.