తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. డీఎంకే సెంటిమెంట్ మీద ఆధారపడే ప్రయత్నాలు చేస్తూండటం, మరో వైపు రెండు కూటముల మధ్య పోరు జరిగే అవకాశం ఏర్పడటమే దీనికి కారణం. జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడులో డీఎంకే డ్రీమ్ రన్ కొనసాగుతోంది. ఏ ఎన్నికలు వచ్చినా స్వీప్ చేస్తున్నారు. కానీ ఈ సారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎవరూ ఊహించనంత హోరాహోరీగా జరగనున్నాయి.
విపక్షాలన్నీ ఏకమయ్యే పరిస్థితులు
తమిళనాడులో విపక్షాలన్నీ ఏకమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకూ డీఎంకే కూటమి, అన్నాడీఎంకే కూటమి, విజయ్ పార్టీ మూడు విధాలుగా పోటీ చేస్తారని అనుకున్నారు. అంటే త్రిముఖం పోటీ జరిగి ఉండేది. కానీ కరూర్ ఘటన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. విపక్షాలన్నీ ఏకం అవుతున్నాయి. విజయ్ ను ఓ వైపు లాగడానికి చేస్తున్న ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయని అక్కడి రాజకీయానికి ఓ క్లారిటీ వచ్చింది. ఇక దానికి తగ్గ పరిస్థితుల్ని సృష్టించి ప్రకటించుకోవడమే మిగిలి ఉంటుంది.
తమిళనాడు ప్రజలు వరుసగా రెండో సారి అధికారం ఇస్తే అద్భుతం
తమిళనాడు ప్రజలు వరుసగా రెండో సారి అధికారం ఇవ్వడం అద్భుతం లాంటిదే. జయలలిత, కరుణానిధి కూడా అలాంటి ఫీట్లు అరుదుగానే సాధించారు. ఘోర పరాజయాల నుంచి భారీ విజయాలను ఐదేళ్లలోనే నమోదు చేశారు. అలాగే భారీ విజయాల నుంచి అంతే ఘోరంగా ఓడిపోయారు కూడా. జయలలిత చనిపోయే ముందు వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు చేపట్టారు. కానీ ఆమె గెలుపు మార్జిన్ తక్కువే. స్టాలిన్ కు ఎదురు లేకపోవడంతో రెండో సారి గెలుస్తారని నిన్నామొన్నటిదాకా అనుకున్నారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితులతో గట్టి పోటీ ఖాయమన్న అభిప్రాయానికి వస్తున్నారు.
విజయ్ గేమ్ ఛేంజర్ ఖాయమే
విజయ్ కు నాయకత్వ శూన్యత కలసి వస్తోంది. కానీ ఆయన గెలుస్తారని తమిళనాడులో అనుకోవడంలేదు. సాలిడ్ గా ఇరవై శాతం ఓటు బ్యాంక్ ఆయన సాధిస్తారని భావిస్తున్నారు. ఆ ఓటు బ్యాంక్ ఎవరిది అన్నది కీలకం. సహజంగా విజయ్ కు ఉన్న బ్యాక్ గ్రౌండ్ ప్రకారం..ఆయనకు అండగా ఉండే సామాజికవర్గాల ప్రకారం చూస్తే.. డీఎంకేకు నష్టం జరిగే అవకాశం ఉంది. అన్నాడీఎంకే ఓటు బ్యాంక్ కూడా ఆయనకు రావొచ్చు.కానీ విజయ్ కు గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. కానీ ఆయన ఫలితాలను మార్చగలరు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒప్పుకుంటే అన్నాడీఎంకే కూటమితో ఆయన కలవడం ఖాయమేనని చెబుతున్నారు. అదే జరిగితే.. ఎన్నికలు హోరాహోరీగా జరుగుతాయని లెక్కలేస్తున్నారు.