జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో ఎన్నికల ప్రచారం అంశం ఏమిటన్నది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. ఫలానా అంశం ఓటర్లను ప్రభావితం చేస్తుందని రాజకీయ పార్టీలు అనుకోలేకపోతున్నాయి. సాధారణంగా ఏదైనా ఎన్నికలు వస్తే దానికి ఓ ఎజెండాను నిర్ణయించే పార్టీకే ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది. అందుకే భారత రాష్ట్ర సమితి మొదటి నుంచి కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో హైడ్రా కూడా ఒకటి.
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే .. ఆ పార్టీకి ఓటేస్తే బుల్డోజర్కు ఓటేసినట్లేనని అది వచ్చి మీ ఇళ్లను కూల్చివేస్తుందని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకూ హైడ్రాకు ఉన్న ఇమేజ్ ను అలా ఉపయోగించుకోవాలని కేటీఆర్ డిసైడ్ అయ్యారు. నియోజకవర్గం పేరు జూబ్లిహిల్సే కానీ.. సంపన్నులు ఉండే కాలనీలు ఓటర్లుగా ఉండరు. అలాంటి కాలనీలన్నీ ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంటాయి. కానీ జూబ్లిహిల్స్ లో మాత్రం మధ్యతరగతి కాలనీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే కేటీఆర్ హైడ్రా బూచి వర్కవుట్ అవుతుందని అనుకుంటున్నారు.
మరో వైపు కాంగ్రెస్ కాంగ్రెస్ హైడ్రానే తమకు ప్లస్ పాయింట్ అనుకుంటోంది. హైడ్రా విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ఇవ్వాలని అనుకోవడం లేదు. హైడ్రా మీ కాలనీల మీదకు రాకుండా చూసుకుంటామని ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు. అసలు స్పందించడం లేదు. నిజానికి హైడ్రా బస్తీల మీదకు రాలేదు. వచ్చినా .. వరదల సమయంలో సాయపడటానికే వచ్చింది. ప్రభుత్వ స్థలాలు కబ్జా అయితే కాపాడటానికే ఎక్కువ చాన్స్ తీసుకుంటోంది. పేదల ఇళ్లపైకి రావడంలేదు.
ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో హైడ్రా అనేది ఎజెండా కాదని అర్థం చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఎజెండాగా మార్చేందుకు తన ప్రయత్నాలు తాను చేయడం ఖాయం. సక్సెస్ అయి ఓటర్లలో ఇదే అంశంపై చర్చ జరిగితే బీఆర్ఎస్ ప్లాన్ వర్కవుట్లు అయినట్లే.