ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అమరావతి , విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ రంగం దూకుడుగా మారుతోంది. కొత్తగా వస్తున్న ప్రాజెక్టులే దీనికి కారణం. ఇన్వెస్టర్లు అమరావతి, ఏపీ వైపు చూస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పై ఎలా ఉంటుందన్నదానిపైనా చర్చలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమరావతిని మళ్లీ రాజధానిగా పునరుద్ధరిస్తుండటం రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోసింది. పాలసీ మార్పులు, భూమి పూలింగ్ హామీలు, ట్యాక్స్ హాలిడేలు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు వంటివి డెవలపర్లను ఆకర్షిస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో రోడ్లు, డ్రైనేజీ, పవర్ గ్రిడ్లు, స్మార్ట్ సిటీ ఫీచర్లు వేగవంతమవుతున్నాయి. ఇది ఎన్ఆర్ఐలు, హై-నెట్‌వర్త్ ఇండివిజువల్స్ను ఆకర్షిస్తూ, భూమి ధరలు పెరగడానికి దారితీస్తుంది.
విశాఖపట్నంలో ఇటీవలి పెట్టుబడులు రియల్ ఎస్టేట్‌ను ఉత్తేజపరుస్తున్నాయి. ప్రభుత్వం ఐదు ఐటీ కంపెనీలకు భూమి కేటాయించింది. తర్లువాడలో గూగుల్ , అనకాపల్లెలో స్టీల్ ప్లాంట్, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులు ఉపాధి సృష్టిస్తాయి. 2024లో 20 శాతం తగ్గిన హౌసింగ్ సేల్స్ మళ్లీ పుంజుకుంటున్నాయి. నగర శివార్లలో హై-రైజ్ వెంచర్లు, మిడిల్-ఇన్కమ్ గ్రూప్‌లకు 2-3 బీహెచ్‌కే ఫ్లాట్లు పెరుగుతున్నాయి.
ఈ డెవలప్మెంట్లు హైదరాబాద్‌పై ప్రభావం చూపుతాయా అంటే.. హైదరాబాద్‌లో పెట్టుబడులు తాత్కాలికంగా మళ్లే అవకాశం ఉండవచ్చు కానీ దీర్ఘకాలంలో పెద్దగా ప్రభావం ఉండదని అంటున్నారు. హైదరాబాద్‌లోని 2021-2024 మధ్య 45% పెరిగిన ధరలు ఇక కొంత స్థిరంగా ఉండవచ్చు. హైదరాబాద్ ఐటీ, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు బలంగా ఉన్నాయి కానీ.. డిమాండ్ తగ్గదని అంచనా వేస్తున్నారు.