ఎవరికైనా ఏదైనా లక్ష్యం ఉంటే దాని ప్రకారం ఓ రూట్ మ్యాప్ ఏర్పాటు చేసుకుంటారు. దాని ప్రకారం ముందుకు వెళ్తారు. తిన్నామా..పడుకున్నామా.. తెల్లారిందా అన్నట్లుగా ఉంటే ఎప్పటికీ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట గాలికి కొట్టుకుపోతూంటే ఎక్కడ తేలతారో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు వైసీపీ పరిస్థితి అంతే ఉంది. ఓ కీలకమైన అంశంపై తన విధానాన్ని ఖరారు చేసుకోలేక .. అన్ని మాటలు మాట్లాడుతున్నారు. చివరికి ప్రజల ముందు జోకర్లుగా నిలిచారు. ఇలాంటి రాజకీయ విధానాలతో ఎలా నెట్టుకు రావాలని అనుకుంటున్నారో కానీ వారి తీరు చూస్తే మాత్రం ఇలా మాత్రం రాజకీయాలు చేయకూడదని ఎవరైనా అనుకుంటారు.
విశాఖ ఏఐ హబ్‌పై వివాదం చేయాల్సిన అవసరం ఏముంది?
విశాఖ డేటా సెంటర్ అనేది ఏపీకి ఓ మంచి అవకాశం. అందరూ అదే చెబుతారు. కాస్త చదువుకున్న వాళ్లకు ఈ విషయం తెలుసు. అలాంటప్పుడు ఈ అంశంపై వైసీపీ ఎలా స్పందించాలి ?. ఎలా స్పందించాలో వైసీపీకే అర్థం కాలేదు. వ్యతిరేకిద్దామా.. క్రెడిట్ మనదే అని చెబుతామా.. అదంతా ఫేక్ ఫెట్టుబడి అని చెబుదామా అని ఆలోచించుకుంటూనే ఉంది. అన్ని రకాల కబుర్లు చెబుతూనే ఉన్నారు. అసలు ఈ పెట్టుబడిని వివాదం చేయాల్సిన అవసరం ఏముందో.. ఊరుకుంటే ఉత్తమం…బోడిగుండంత సుఖం అని ఎందుకు అనుకోలేదో అని క్యాడర్ ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు.
తెచ్చింది మేమే అంటారు.. అదో గోడౌన్ అంటారు !
డేటా సెంటర్ వల్ల ఉపయోగం ఏమీ ఉండదని..కాలుష్యం అని.. ప్రపంచంలో చాలా దేశాలు వాటిని వద్దన్నాయని వైసీపీ ఓ వాదన తెరపైకి తెచ్చింది. మరి అలాంటప్పుడు ఆదాని డేటా సెంటర్ కడతానంటే అప్పనంగా 130 ఎకరాలు ఏకంగా సేల్ డీడ్ ఎందుకు చేశారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అదో గోడౌన్ అని ఎవరెవర్నో తీసుకు వచ్చి సాక్షి చానళ్లలో కూర్చోబెట్టి చెప్పిస్తున్నారు. పరిశ్రమల మంత్రిగా చేసిన గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్లు రెండు వందల కన్నా ఉద్యోగాలు రావాలని అదేపనిగా చెబుతున్నారు. ఆయనకు ఉన్న అవగాహన వైసీపీ స్థాయిలోనే ఉందని నెటిజన్లు స్పందిస్తున్నారు. చాలా సందర్భాల్లో తెచ్చింది మేమే.. క్రెడిట్ చంద్రబాబు కొట్టేస్తున్నారని అంటారు. శ్రీకాంత్ రెడ్డి ఇలాంటి మాటలు మీడియా ముందు చెప్పేటప్పుడు నవ్వుకుని ఉంటారు.
ఓ విధానం పెట్టుకోవడం రాజకీయ లక్షణం
ఏదైనా ఓ అంశంపై స్పందించాలనుకుంటే.. రాష్ట్రం మొత్తం ఓ విధానం పెట్టుకోవాలి. పార్టీ క్యాడర్ కు అదే చెప్పాలి. పార్టీ నేతలకు పార్టీ విధానాన్ని చెప్పాలి . దానికి అనుగుణంగానే స్పందించాలని చెప్పాలి. ఇతర అంశాల్లో.. స్క్రిప్ట్ ను సజ్జల ఆఫీసు నుంచి పంపిస్తారు.కానీ డేటా సెంటర్ విషయంలో ఆయన కూడా పట్టించుకున్నట్లుగా లేరు. జగన్ విదేశాల్లో ఉన్నందున సజ్జల వదిలేశారేమో కానీ.. వైసీపీ పరువు రోడ్డున పడింది. నిజానికి అదేమీ లేకపోవడమే వైసీపీ స్పెషాలిటీ కాబట్టి.. వారికేమీ అనిపించదు.