మల్టీ నేషనల్ కంపెనీల్లో పని చేసే ప్రవాసాంధ్రులే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లని మంత్రి నారా లోకేష్న్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఆయన సిడ్నీలో ప్రవాస తెలుగువారితో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తోందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి మేలు చేసే ఎలాంటి అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని ప్రవాసాంధ్రులకు సూచించారు.
చంద్రబాబు వయసు 75 ఏళ్లు అయినప్పటికీ, 25 ఏళ్ల యువకుడిలా అలుపెరగని కృషి చేస్తున్నారు. వైసీపీ పాలనలో అరెస్ట్ చేసిన సమయంలో ప్రవాసాంధ్రులంతా మద్దతుగా నిలిచారు. ఏపీలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్‌లా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కేంద్ర సహకారంతో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటవుతోందని, ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ కూడా ఒక్క జూమ్ కాల్తోనే ఏపీలో పెట్టుబడులకు అంగీకరించిందని తెలిపారు.
ప్రధాని మోదీ సహకారం, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ మద్దతుతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి నీరందిస్తామని హామీ ఇచ్చారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని లోకేశ్ వెల్లడించారు. ఆస్ట్రేలియాలోని కంపెనీల్లో పనిచేసే తెలుగువారు ఏపీ అంబాసిడర్లలా పనిచేయాలి… మీ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉంటే మాకు తెలియజేయాలని కోరారు.
పక్క రాష్ట్రాలతో పెట్టుబడుల కోసం చిన్నచిన్న యుద్ధాలు జరుగుతున్నాయని, కానీ క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని ..రాష్ట్రాల మధ్య పోటీ భారత్ అభివృద్ధికి మేలు చేస్తుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ప్రవాసాంధ్రులు తమ అనుభవాలు, సూచనలు పంచుకున్నారు.