అనుకొందే అయ్యింది. ఈ సంక్రాంతికి శర్వానంద్ సినిమా కూడా బరిలో నిలిచింది. శర్వానంద్ కొత్త చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’ పొంగల్ కే విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఈరోజు దీపావళి. ఈ సందర్భంగా రిలీజ్ పోస్టర్ బయటకు వదిలింది. `సామజవరగమన` ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.
అనిల్ సుంకర నిర్మాత. మీనాక్షి చౌదరి, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు.
సంక్రాంతి అనగానే పెద్ద హీరోల సందడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. చిరంజీవి, ప్రభాస్ చిత్రాలు ఈ పండక్కే వస్తున్నాయి. రవితేజ సినిమా కూడా ఈసారి బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళం నుంచి విజయ్, శివ కార్తికేయన్ సినిమాలు రాబోతున్నాయి. వీటి మధ్య శర్వా పోటీకి దిగుతున్నాడు. పెద్ద సినిమాలు వచ్చినప్పుడు శర్వానంద్ లాంటి మీడియం రేంజ్ చిత్రాలు బయటకు రావడానికి ఆలోచిస్తాయి. కానీ శర్వా ‘శతమానం భవతి’ కూడా ఇలానే పెద్ద హీరోల సినిమాలతో పోటీగా నిలిచి, సంక్రాంతి విజేతగా నిలిచింది. ఇప్పుడు కూడా అదే ఫీట్ రిపీట్ అవుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. పైగా ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఈతరహా జోనర్లు పర్ఫెక్ట్ యాప్ట్. అందుకే శర్వా ఇంత రిస్క్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ కూడా రెడీ అయ్యిందని, త్వరలో విడుదల చేయబోతున్నారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.