హారర్ కామెడీ యూనివర్స్ తో బాలీవుడ్ లో ఓ ట్రెండ్ సెట్ చేసింది మాడాక్ ఫిల్మ్స్. స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2 ఈ యూనివర్స్ లో వచ్చిన చిత్రాలే. ఇప్పుడు ఇదే హారర్ యూనివర్స్‌లో రష్మిక – ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘థామా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమకథకు పెట్టపీట వేస్తూ సాగిన థామాలో ఆకట్టుకున్న అంశాలు ఏమిటి? ఈ యూనివర్స్ లో వచ్చిన సినిమాలకి వేసిన ముడి ఎంత బలంగా వుంది ?
అలోక్ గోయల్ (ఆయుష్మాన్ ఖురానా) ఓ డిజిటల్ జర్నలిస్ట్. అడ్వెంచర్ ట్రిప్ లో భాగంగా ఓ పర్వత ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ అలోక్ పై ఓ ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) తనని కాపాడుతుంది. తడ్కా మామూలు అమ్మాయి కాదు. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. బేతాళ జాతికి నాయకుడు యక్షాసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖీ) కారణంగా అలోక్ చిక్కుల్లో పడతాడు. అలోక్ ని కాపాడే క్రమంలో తడ్కా అలోక్ తో పాటు ఢిల్లీ వెళ్తుంది. తర్వాత ఏం జరిగింది ? తడ్కా బేతాళ జాతికి చెందిన అమ్మాయని అలోక్ తెలుసుకున్నాడా? ఈ ప్రేమ జంటకి, యక్షాసన్, భేడియా నుంచి ఎదురైనా సవాళ్ళు ఏమిటనేది మిగతా కథ.
స్త్రీ, భేడియా, ముంజ్యా, స్త్రీ 2.. సినిమాలకి మూలం జానపధం. చందమామ కథల్లా ప్రాచుర్యంలో వుండే పాయింట్లు ఆధారంగా కథనం రాసుకోవడం ఈ యూనివర్స్ సక్సెస్ ఫార్ములా. థామా కూడా అలాంటి కథే. మనుషులని రక్షించడం కోసం ఉద్భవించిన ఓ భేతాళ జాతి, ఆ జాతికి వ్యక్తిరేకంగా తిరిగిన నాయకుడు, ఆ నాయకుడికి బుద్ది చెప్పే ఓ ప్రేమజంట. ఇదే థామా బేసిక్ లైన్. కాకపోతే ఈ లైన్ లో కామెడీ, హారర్, ప్రేమకథ మేళవింపు ఇంకా బలంగా కుదరాల్సింది.
అలెగ్జాండర్ సీక్వెన్స్‌తో సినిమాని ఆరంభించిన తీరు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడిలో ఉత్సాహాన్ని కలిగించలేదు. గోయల్, తడ్కా లవ్ స్టొరీలో ఎమోషన్ ప్రేక్షకుడికి పట్టదు. అలాగే తడ్కా చేసే విన్యాసాలు, వాటికి వచ్చే రియాక్షన్స్ కూడా రొటీన్ అనిపిస్తాయి. కథ ఢిల్లీకి షిఫ్ట్ అయిన తర్వాత పరేష్ రావల్ చేసే కామెడీ వర్క్ అవుట్ కాలేదు. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా ఫ్లాట్ గా వుంటుంది.
సెకండ్ హాఫ్ లో గోయల్ బేతాళుడిగా మారిన తర్వాత కథనంలో కొంత వేగం వస్తుంది. ఇక్కడే భేడియా యూనివర్స్ నుంచి వరుణ్ ధావన్ కూడా రంగంలో దిగుతాడు. ఈ క్రమంలో వచ్చేయాక్షన్ సీక్వెన్స్, తర్వాత కథ థామా వరల్డ్ కి షిఫ్ట్ కావడం చకచక జరుగుతుతాయి. క్లైమాక్స్ లో రక్తాలు తాగే కాన్సెప్ట్ కి ఒక జస్టిఫికేషన్ ఇచ్చారు కానీ యాక్షన్ సీక్వెన్స్ ని సాగదీశారు. ఈ యూనివర్స్ కి కొనసాగింపుగా ఇచ్చిన లీడ్ ఆసక్తికరంగానే వుంటుంది.
ఆయుష్మాన్ ఖురానా రెండు వేరియేషన్స్ వుండే పాత్రలో కనిపించాడు. ఫస్ట్ హాఫ్ తనకి అలవాటైనదే. సెకండ్ హాఫ్ లో తన పెర్ఫార్మెన్స్ కి మంచి స్కోప్ దొరికింది. రష్మిక కి ఇది వైవిధ్యమైన పాత్రే. ఇలాంటి పాత్ర చేయడానికి ధైర్యం కావాలి. అయితే ప్రేమకథలో ఎమోషన్ తగ్గడంతో ఆ పాత్ర లోతుగా హత్తుకోలేకపోయింది. పరేశ్ రావల్ పాత్రలో సహజమైన వినోదం లేదు. యక్షాసన్ గా నవాజుద్దీన్ కనిపించాడు. అయితే ఇలాంటి పాత్రకు ఆయన అవసరం లేదు. ఆయన నటన ప్రత్యేకంగా ఏమీ కనిపించలేదు. వరుణ్ ధావన్ కనిపించింది కాసేపైన అలరిస్తాడు. మలైకా అరోరా, నోరా ఫతేహి ఐటెం సాంగ్స్ లో సందడి చేశారు. కెమరా వర్క్, విజువల్స్ ఎఫెక్ట్స్ బావున్నాయి. సచిన్-జిగర్ బీజీఎం డీసెంట్ గా వుంది. తెలుగు డబ్బింగ్ సరిగ్గా కుదరలేదు. హిందీ వెర్షన్ లో చూడటమే బెటర్.