కందుకూరులో జరిగిన లక్ష్మినాయుడు అనే యువకుడి హత్య కేసులో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. నిందితులకు కఠినశిక్ష వేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో లక్ష్మినాయుడు కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా నిలవాలని నిర్ణయించారు. లక్ష్మినాయుడు భార్యకు 2 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదు పరిహారం, ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, రూ.5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాటిజ్ చేయాలని నిర్ణయించారు.
శాంతిభద్రతలపై నిర్వహించిన సమీక్షలో చంద్రబాబు ఈ హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. లక్ష్మీ నాయుడు పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని నిర్ణయించారు. దాడిలో గాయపడ్డ లక్ష్మినాయుడు సోదరులు పవన్, భార్గవ్‌కు కూడా పరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. పవన్‌కు 4 ఎకరాల భూమి, రూ.5 లక్షల నగదుతో పాటు ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించనుంది. భార్గవ్‌కు రూ.3 లక్షల నగదు, ఆసుపత్రి ఖర్చులు చెల్లించనున్నారు.
లక్ష్మీ నాయుడు హత్య కేసు విచారణ వేగంగా జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించి.. కోర్టులో కేసు విచారణ కోసం ప్రత్యేక పీపీని నియమించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు. వ్యక్తిగత, ఆర్థిక కారణాలతో జరిగిన ఈ హత్యను వైసీపీ కుల రాజకీయం చేయడానికి ఉపయోగించింది. ఈ వ్యవహారంలో వైసీపీ కుట్రలు ఫలించకుండా ఉండటానికి ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించింది. వారి న్యాయం చేసేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.