విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం దేశ పారిశ్రామిక, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్ అయింది. అయితే తమిళనాడులో ఇది మరింత ఎక్కువగా ఉంది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడంతో దేశానికి చెందిన అతి పెద్ద ఎఫ్డీఐ తమిళనాడుకు తేలేకపోయారని అన్నా డీఎంకే నేతలు.. సీఎం స్టాలిన్ పై విరుచుకుపడుతున్నారు. ఈ అంశంపై రెండు పార్టీల నేతలు వాదోపవాదాలకు దిగుతున్నారు. చివరికి జాతీయ మీడియాలో చర్చలకూ వెనుకాడటం లేదు.
ఇలా ఓ ఇంగ్లిష్ చానల్లో జరిగిన చర్చలో డీఎంకే, అన్నాడీఎంకే నేతలు వాదోపవాదాలకు దిగారు. అన్నాడీఎంకే వైఫల్యమని చెప్పుకొచ్చారు. కానీ గూగుల్ అంతర్జాతీయ సంస్థ అని.. అన్నీ చూసుకుని ఎక్కడ పెట్టారో డిసైడ్ చేసుకుంటారని డీఎంకే ప్యానలిస్టులు చెబుతున్నారు. అయితే తమిళనాడు పార్టీల వాదనను లోకేష్ చాలా సింపుల్గా తేల్చేశారు. సుందర్ పిచాయ్.. ఇండియాను ఎంపిక చేసుకున్నారని రాష్ట్రాలను కాదని అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.
గూగుల్ లాంటి సంస్థకు నాయకత్వం వహిస్తున్నప్పుడు.. సుందర్ పిచాయ్ ఏకపక్షంగా ఏ నిర్ణయం తీసుకోలేరు. అలాంటి కంపెనీల్లో ఓ ఎకో సిస్టమ్ ఉంటుంది. కంపెనీకి ఎక్కడ లాభదాయకమో..ఎక్కడ సస్టెయినబులో అంచనా వేసుకుని ఎన్నో పారామీటర్స్ ను చూసుకున్న తర్వాతే ఫైనల్ చేసుకుంటారు. సుందర్ పిచాయ్ తమిళనాడు అయినా.. బెంగాల్ అయినా ఆయన తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోలేరు. కానీ రాజకీయ నేతలకు మాత్రం ఈ క్లారిటీ ఉండదు.