జూబ్లిహిల్స్ ప్రచారానికి బీఆర్ఎస్ పార్టీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితా విడుదల చేసింది. ఇందులో మొదటి పేరు కేసీఆర్. దీంతో ఆయన ప్రచారానికి వస్తారహో అని కొంత మంది ప్రచారం చేయడం ప్రారంభించారు. బీఆర్ఎస్ మొట్ట మొదటి స్టార్ క్యాంపెయినర్ ఎప్పుడూ కేసీఆరే అవుతారు. అందుకే జాబితాలో ఆయన పేరు ఉంటుంది. కానీ ఆయన ప్రచారానికి వస్తారన్న గ్యారంటీ అది కాదు. ఆయన వచ్చినా రాకపోయినా ఆయన పేరు పెట్టడం అనేది సంప్రదాయం. గౌరవం కూడా. అంటే లాంఛనం అనుకోవచ్చు. కేసీఆర్ మాత్రం జూబ్లిహిల్స్‌లో ప్రచారానికి వచ్చే అవకాశాలు లేవు అనేది బీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇప్పటికే పరోక్షంగా క్లారిటీ ఇచ్చారు.
ఉపఎన్నికల్లో ప్రచారం చేయని కేసీఆర్
భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఉపఎన్నికల్లో ఎప్పుడూ ప్రచారం చేయలేదు. సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన ఉపఎన్నికలు వస్తే పూర్తిగా తెర వెనుక పాత్రకే ప్రాధాన్యమిస్తారు. నేరుగా రంగంలోకి దిగి ప్రచారం చేయలేదు. గతంలో దుబ్బాకకు ఉపఎన్నిక జరిగినప్పుడు పరిస్థితి తేడాగా ఉందని.. ఒక్క ప్రచార సభలో పాల్గొంటే సెట్ అవుతుందని సంకేతాలు వచ్చినా కేసీఆర్ పట్టించుకోలేదు. అందులో ఓడిపోయారు. సీఎంగా ఉన్నంత కాలం జరిగిన ఉపఎన్నికల్లో ఒక్క చోట కూడా ప్రచారం చేయలేదు. ఉపఎన్నికల్లో ప్రచారం చేయకుండా గెలవడం అన్నది ఆయన పాలసీ. ఉపఎన్నికల్లో ప్రచారం స్థాయికి తక్కువగా భావిస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం మినహాయింపు ఇచ్చారు. మునుగోడు ఉపఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడం .. భవిష్యత్ రాజకీయాలను మార్చేవిగా ఉండటంతో ఓ. బహిరంగసభలో ప్రసంగించారు.
ఒక్క ప్రచార సభ అయినా ప్లస్సే !
కేసీఆర్ కొంత కాలంగా.. రాజకీయంగా అజ్ఞాతంలో ఉన్నారు. పార్టీ సిల్వర్ జూబ్లి సభలో ప్రసంగించారు. ఆ తర్వాత సైలెంటుగా ఉన్నారు. సరైన సమయం చూసి ప్రజల్లోకి వస్తారని అంటున్నారు. బహుశా ఎన్నికలకు ఏడాది ముందు నుంచి కార్యాచరణ ఖరారు చేసుకునే అవకాశం ఉంది. అంతే కానీ ఉపఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే జూబ్లిహిల్స్ .. బీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకం. గెలుపోటములు చాలా తీవ్ర ప్రభావం చూపిస్తాయి. గెలవకపోతే.. సిట్టింగ్ సీటు పోతుంది. పార్టీ కరిగిపోతుందని ప్రజలు నమ్ముతారు. ఇలాంటి సమయంలో జూబ్లిహిల్స్ ను నిలబెట్టుకోవడానికి కేసీఆర్ ఒక్క రోజు సభలో ప్రసంగించినా చాలని బీఆర్ఎస్ నేతలు అనుకుంటున్నారు.
తెర వెనుక వ్యూహాలకే పరిమితం !
ప్రస్తుతం కేసీఆర్ తెర వెనుక వ్యూహాలకే పరిమితమవుతున్నారు. ఆయన జూబ్లిహిల్స్ విషయంలో ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుని ..తదుపరి ఏం చేయాలో కేటీఆర్, హరీష్ రావులకు సందేశాలు ఇస్తున్నారని చెబుతున్నారు. పార్టీ పరిస్థితి ఎక్కడెక్కడ మెరుగ్గా ఉంది.. ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాలి.. ఓటింగ్ ఎజెండాగా దేన్ని డిసైడ్ చేయాలో ఆయన సలహాలిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ సృష్టించే విషయంలోనూ ఆయన తెర వెనుక వ్యూహరచనలు చేస్తున్నారని చెబుతున్నారు. నేరుగా అయితే కేసీఆర్.. జూబ్లిహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని అనుకోవచ్చు.