కందూకురు ఘటనలో హత్యకు గురైన లక్ష్మినాయుడు కుటుంబానికి ప్రభుత్వ సాయం చేయడంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో ప్రధాన సమస్యలు పక్కనపెట్టి కుల గొడవలు, హత్యలు మీద దృష్టి పెడుతున్నారని మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. పోలీసులు చేయాల్సిన పని చేయడం లేదన్నారు. కులాల గొడవలతో కొట్టుకు చస్తే ఎకరాలకు ఎకరాలు, లక్షలకు లక్షలు ఇచ్చేస్తారా..? అని ప్రశ్నించారు. ఎవడబ్బ సొత్తు ఇది.. వాళ్ల సొంత ఆస్తులు ఇస్తున్నారా..? అని పాలకులపై మండిపడ్డారు.
రాష్ట్రంలో ఏడాదికి 900 హత్య కేసులు నమోదవుతున్నాయి..అందరికి ఇదే విధంగా పరిహారం ఇస్తారా అని ఆయన ప్రశఅనించారు. ఏయే కులాల కొట్టుకుంటే.. నష్ట పరిహారం ఇస్తారు? కొన్ని కులాల్లో మాత్రమే చంపుకుంటేనే ఇలాంటి నష్ట పరిహారం ఇస్తారా? లేక అన్ని కులాలకు ఇదే విధమైన నిబంధన వర్తిస్తుందా? చెప్పాలని ఆయన నిలదీశారు. కందుకూరులో ఆర్థిక లావాదేవీల అంశంలో లక్ష్మినాయుడు అనే వ్యక్తిని హరిచంద్రప్రసాద్ అనే వ్యక్తి కారుతో గుద్ది చంపేశారు. ఇది కుల రాజకీయాలకు కారణం అయింది.
దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది. నిందితుల్ని అప్పుడే అరెస్టు చేశారు. వారి ఆస్తుల్ని జప్తు చేసేందుకు కోర్టుకు వివరాలు సమర్పించారు.అయితే ప్రభుత్వం భారీగా పరిహారం ప్రకటించారు. లక్ష్మినాయుడు భార్య, పిల్లలకు తలా రెండు ఎకరాలు, ఆ దాడిలో గాయపడిన లక్ష్మినాయుడు సోదరుడికి ఐదు ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.దీనిపైనే విమర్శలు వస్తున్నాయి. హత్యలు చేసుకుంటే.. డబ్బులు, ఎకరాలు రాసిస్తారా అని ప్రశ్నిస్తున్నారు.