లండన్ పోయి వచ్చాక జగన్ రెడ్డి.. తాను తాడేపల్లికి వచ్చానోచ్ అని చెప్పుకోవడానికి ఓ ప్రెస్మీట్ ఎర్పాటు చేశారు. ఇందులో ఆయన ఎప్పుడూ చెప్పే స్వకుచమర్దనం, చంద్రబాబుపై నిందలతో పాటు ఈ సారి కొత్తగా గూగుల్ పురాణం చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచారు. గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ నేతలు, సాక్షి మీడియాకు సరైన దిశానిర్దేశం లేక ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూంటే.. జగన్ రెడ్డి వచ్చి.. అది మా విత్తనమే అని చెప్పుకొచ్చారు. ఇంకా విచిత్రం ఏమిటంటే అది గూగుల్ డేటా సెంటర్ కన్నా అదానీ డేటాసెంటర్ అని చెప్పడానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.
గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని.. అది తాము వేసిన విత్తనమే అని చెప్పుకున్నారు. ఆ విత్తనం ఎక్కడిదంటే…అదానీ డేటా సెంటర్ దగ్గర ఉందట. అదానీ డేటా సెంటర్ పెడతామని చెబితే ఓ కొండను జగన్ రెడ్డి రాసిచ్చారు. అక్కడేమీ పెట్టలేదు. కానీ ఇప్పుడు గూగుల్ పెడుతూంటే..అది అదానీదేనని చెబుతున్నారు. అదానీ కడతారట..గూగుల్ వాడుకుంటుందట. ఈ విషయాన్ని జగన్ రెడ్డికి ఎవరు చెప్పారట.. కాటమనేని భాస్కర్ కు మెయిల్ వచ్చిందట. ఆ మెయిల్ జగన్ కు ఎలా వచ్చిందో .. ఎవరు చెప్పారో కానీ.. అసలు గూగుల్ ఎప్పుడూ..ఎక్కడా ..తాము అదాని తో భాగస్వామ్యం అయ్యామని చెప్పలేదు.
అదానికి సంబంధం లేకపోయినా అదాని పేరు ఎందుకు చెప్పడం లేదంటూ జగన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. క్రెడిట్ ఇవ్వడం లేదని అంటున్నారు. హోదా ఇవ్వడం లేదని ఏడ్చినట్లుగా..ఇప్పుడు క్రెడిట్ ఇవ్వడం లేదని కూడా ఆయన ఏడుపు అందుకునేలా మాట్లాడారు. హైదరాబాద్ అభివృద్దిలో.. హైటెక్ సిటీ ఏర్పాటులో కూడా చంద్రబాబు పాత్ర లేదట. కంప్యూటర్లు కూడు పెడతాయా అన్న ఆయన తండ్రి హయాంలోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందట. ఈ ప్రెస్మీట్ మొత్తం జగన్ రెడ్డి.. విచిత్రమైన వాదనలతో ఎప్పట్లాగే అందర్నీ ఎంటర్టెయిన్ చేశారు.