సినిమాల్లోకి ఎవరైనా రావొచ్చు. ఎవరైనా ఎదగొచ్చు. కానీ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం చాలా కష్టం. ఓ విజయాన్ని అందుకొని, దాన్ని కొనసాగించడం మరింత కష్టం. ప్రదీప్ రంగనాథ్ ఎదుగుదల చూస్తే మాత్రం హిట్లు కొట్టడం ఇంత ఈజీనా అనిపిస్తుంది. ‘లవ్ టుడే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. ఆ సినిమాకు దర్శకుడు కూడా తానే. విడుదలకు ముందు ఎలాంటి బజ్ లేదు. కానీ… సినిమా రిలీజ్ అయ్యాక యూత్ స్టార్ అయిపోయాడు. ఆ సినిమా తెలుగులోనూ బాగా ఆడింది. తమిళనాట వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఆ తరవాత వచ్చిన ‘డ్రాగన్’ కూడా సూపర్ హిట్టయిపోయింది. రెండు సినిమాలతో.. ఒక్కసారిగా ప్రదీప్ పేరు మార్మోగిపోయింది. ధనుష్ కి డూప్ అని, మరో రజనీకాంత్ అవుతాడని కితాబులు అందుకొన్నాడు.
మూడో సినిమా ‘డ్యూడ్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మైత్రీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడం మరింత ప్లస్ అయ్యింది. రిలీజ్ రోజున కాస్త డివైడ్ టాక్ వచ్చినా.. మెల్లమెల్లగా నిలబడిపోయింది. తమిళ నాట మరో వంద కోట్ల సినిమాగా నిలిచింది. ఇలా వరుసగా మూడు సినిమాల్ని వంద కోట్ల లో చేరిపోవడం మామూలు విషయం కాదు. పైగా డివైడ్ టాక్ తోనూ వంద కోట్లు సాధించడం గొప్ప సంగతే. తమిళ నాట ప్రదీప్ రంగనాథ్ కి పెరుగుతున్న ఆదరణకు ఇది నిదర్శనం. ఈ దెబ్బతో ప్రదీప్ ని కూడా స్టార్ల లిస్టులో చేర్చేశాయి ట్రేడ్ వర్గాలు. తెలుగులో కూడా ప్రదీప్ తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకొంటున్నాడు. ముఖ్యంగా యూత్ లో తన క్రేజ్ బాగుంది. ‘డ్యూడ్’కి వచ్చిన ఓపెనింగ్సే ఇందుకు నిదర్శనం. కెరీర్ ప్రారంభంలోనే ఓ యువ హీరోని ధనుష్, రజనీకాంత్ లాంటి స్టార్లతో పోల్చడం తొందరపాటు చర్య అవుతుందని అనుకొన్న వాళ్లకు ఇప్పుడు ‘డ్యూడ్’ తో సమాధానం చెప్పినట్టైంది. ప్రదీప్ నుంచి త్వరలో `ఎల్.ఐ.సీ` అనే మరో సినిమా రాబోతోంది. దానికి తెలుగులో మరింత డిమాండ్ పెరగడం ఖాయం.
