జూబ్లిహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీ కంటే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఉంది. హైకమాండ్ ఎప్పటికప్పుడు వెనక్కి లాగుతున్నా.. అక్కడ వ్యూహాల్లో రేవంత్ పాత్ర లేకుండా చేస్తున్నా.. ఎవరెవరో వచ్చి స్ట్రాటజిస్టులమని .. కలగాపులగం చేసినా.. తర్వాత ఎవరూ బాధ్యత తీసుకోరు. ఓడిపోతే అసలు తీసుకోరు. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డినే నిలదీస్తారు. చివరికి హైకమాండ్ కూడా ఆయనపై ఫెయిల్ ముద్ర వేస్తుంది. అందుకే పార్టీ పరంగా కాకపోయినా వ్యక్తిగతంగా అయినా రేవంత్ ఈ ఎన్నిక బాధ్యతను తీసుకోవాల్సి ఉంది.
రేవంత్ ను నియంత్రిస్తున్న కాంగ్రెస్ హైకమాండ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి అని తెలుసు.కానీ ఆయన బలపడితే ఎక్కడ మరో వైఎస్ అవుతారోనన్న కారణంగా.. ఎప్పటికప్పుడు ఆయనను నియంత్రిస్తూ వస్తోంది. ఇతర నేతలకూ ప్రాధాన్యత ఇస్తూ.. రేవంత్ సిఫారసులను పక్కన పెడుతూ వస్తోంది. ఫలితంగా మంత్రులు కూడా.. రేవంత్ గ్రిడ్ నుంచి జారిపోతున్నారు. కేబినెట్ లోనే ఆయనను లెక్క చేయని వారు తయారయ్యారు. వారి బలం హైకమాండ్. రేవంత్ ను బలహీనం చేసే పనిలో వారిని ప్రోత్సహిస్తున్నారు.
నవీన్ యాదవ్ ప్రచారంలో వివాదాలే ఎక్కువ
సీనియర్ నేతల వివాదాల ప్రభావం పార్టీపై పడుతోంది. దానికి జూబ్లిహిల్స్ ఉపఎన్నికే ఉదాహరణ. నవీన్ యాదవ్ కు వ్యక్తిగత బలం ఉండటం.. బలగం ఉండటంతో ఆయన ప్రచారంలో కాస్త జోరు చూపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు కలగాపులగం చేసేస్తున్నారు. ముఖ్యనేతలు వచ్చినప్పుడు వివాదాలకు దిగుతున్నారు. రేవంత్ రెడ్డి నేరుగా ప్రచారం చేస్తారో లేదో స్పష్టత లేదు. కానీ రాష్ట్ర స్థాయి నేతలు జూబ్లిహిల్స్ కు వచ్చినప్పుడు వారి మధ్య గొడవలు, వివాదాలే హైలెట్ అవుతున్నాయి.
గెలిస్తే క్రెడిట్ ఇవ్వరు కానీ ఓడితే బాధ్యుల్ని చేస్తారు !
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఫలితం అనుకూలంగా.. వస్తే ప్రజల్లో రేవంత్ కు పలుకుబడి పెరుగుతుంది. కానీ హైకమాండ్ వద్ద పెరగదు. ఎందుకంటే ఆయన పలుకుబడిని తగ్గించాలని వ్యూహాత్మకంగా వారే వ్యవహరిస్తున్నారు. కానీ ఓడితే మాత్రం ఆయనను బాధ్యుడ్ని చేసి.. మరింతగా కించ పరచడానికి.. ఇతర నేతల్ని ప్రోత్సహించడానికి రెడీగా ఉంటారు. అందుకే.. రేవంత్ కు గెలుపు చాలా కీలకం. ప్రస్తుతానికి అడ్వాంటేజ్ గా కనిపిస్తున్నా.. లోపాయికారీ రాజకీయాలు ఏ దారికి తీసుకెళ్తాయో అంచనా వేయడం కష్టం. అందుకే సీఎం జాగ్రత్తపడాలేమో !
