సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో రాజాసాబ్ ఒకటి. జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. పండక్కి మొదట పలకరించేది ప్రభాస్ సినిమానే. ఇప్పటికే ఓ ట్రైలర్ విడుదలైంది. మరో ట్రైలర్ రిలీజ్ కి ముందు రాబోతోంది. జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా ఈ ట్రైలర్ విడుదల చేసు అవకాశం ఉంది. అయితే..ఈ ట్రైలర్ కోసం మారుతి ఓ ప్రయోగం చేయబోతున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్.
సాధారణంగా ట్రైలర్ అనేది సినిమాలోని కీ షాట్స్ కట్ చేసి డిజైన్ చేస్తారు. కానీ ట్రైలర్ కోసం మారుతి స్పెషల్ షూట్ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అది ప్రమోషనల్ కంటెంట్ లా కనిపిస్తూనే ట్రైలర్ అంతటి ఎఫెక్ట్ ఇచ్చేలా దీన్ని డిజైన్ చేస్తార్ట. అందుకోసం రెండు మూడు రోజుల పాటు ప్రత్యేక షూట్ నిర్వహించబోతున్నార్ట. సినిమా షూటింగ్ పూర్తయిన తరవాత, ఈ ట్రైలర్ కోసమే స్పెషల్ షూట్ నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకోసం రెండు మూడు కాన్సెప్టులు కూడా డిజైన్ చేస్తున్నారు. ఓరకంగా ఇదో ప్రయోగం అనుకోవాలి. ఇది క్లిక్ అయితే ఇప్పటి నుంచి అంతా రాజాసాబ్ మోడల్ ని అనుసరిస్తారు.
నవంబరు 5న రాజాసాబ్ నుంచి తొలి పాట రాబోతోంది. నిజానికి ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటని విడుదల చేద్దామనుకొన్నారు. కానీ కుదర్లేదు. ఇటీవల గ్రీస్ లో రెండు పాటల్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. డిస్కో డాన్సర్ సినిమాలోని ఓ పాటని రీమిక్స్ చేశారు. బహుశా.. ఆ పాటే ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
