తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనకు ఎంతో బలం ఉన్నా.. ఇతరుల ముందు అంటే తన మంత్రుల ముందు చులకన అయిపోతున్నారని ఇప్పటి వరకూ జరిగింది చాలు ఇక విశ్వరూపం చూపించాలని ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే..తన కొత్తపలుకు ద్వారా సలహా ఇచ్చారు. రేవంత్ రెడ్డి పడుతున్న కష్టాలు చూసి ఆర్కే బాధపడుతున్నారని ఆయన ఆర్టికల్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. స్వయంగా ముఖ్యమంత్రిని.. ఓ మంత్రి కుమార్తె దారుణంగా దూషించడం, ఆ మంత్రి ఇంకా కేబినెట్లో కొనసాగడాన్ని ఆర్కే కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
అదే సమయంలో రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎం అన్న ముద్ర వేయడానికి మంత్రులు కొంత మంది కుట్రలు చేస్తున్న వైనాన్ని.. రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం జరుగుతూంటే.. ఒక్క మంత్రీ ఖండించకపోవడాన్ని ఆర్కే గుర్తు చేశారు. ఇలాంటి పరిణామాలన్నీ చూసి.. రేవంత్ కు కూడా విసుగు వచ్చిందని.. అందుకే మంత్రులకు కూడా ఆయన లెఫ్ట్ రైట్ వాయించేశారని చెప్పుకొచ్చారు. కేబినెట్ లో ఇలా జరిగిందో లేదో ఎవరికీ తెలియదు. కానీ ఆర్కే చెబుతున్నారు. ఇలా మాటలతో పని కాదు.. ఇక చేతలు ప్రారంభించాలని ఆర్కే సూచన.
విశ్వరూపం చూపించడానికి సందేహించాల్సిన అవసరం లేదని ధైర్యంకూడా చెప్పారు. ముఖ్యమంత్రి పదవి తుమ్మితే ఊడిపోయేది కాదని.. గుర్తు చేశారు. ఇపుడు ఉన్న పరిస్థితుల్లో హైకమాండ్ కూడా.. ముఖ్యమంత్రి మార్పు గురించి ఆలోచించే సాహసం చేయదన్నారు. అందుకే రేవంత్ .. ఒక్క సారి వైఎస్‌ను గుర్తు చేసుకుని.. తన పార్టీని ప్రాంతీయ పార్టీలా నడిపి గుప్పిట్లోకి తెచ్చుకోవాలని సలహా ఇచ్చారు. అందు కోసం వైఎస్ ఫార్ములా పాటించాలని కూడా సూచించారు.
ఈ వారం కొత్త పలుకు మొత్తం చదివితే.. రేవంత్ రెడ్డికి ఎదురువుతున్న పరిస్థితులు..దాని వల్ల ఎదురవ్వబోయే పరిణామాలను గుర్తు చేసి.. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా సలహాలు ఇచ్చినట్లుగా కూడా స్పష్టమవుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ ను గెలిపించేందుకు ఆయన ఎంత కష్టపడ్డారో కూడా గుర్తు చేసే ప్రయత్నం చేశారు. మరి ఆర్కే సలహాలను రేవంత్ పాటిస్తారా?

