టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్.. కరూర్ రోడ్ షోలో తొక్కిసలాట కారణంగా చనిపోయిన41 మందిని ఇప్పటి వరకూ పరామర్శించలేదు. గతంలో కరూర్ వెళ్లి.. అక్కడ ఓ స్టార్ హోటల్లో పరామర్శిస్తారని ప్రచారం జరిగింది.కానీ వాయిదా వేసుకున్నారు. పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని కారణం చెప్పారు. మరీ ఆలస్యం అవుతూండటంతో.. ఆ బాధిత కుటుంబాలకు ఓదార్చకపోతే సమస్యలు వస్తాయని కొత్త ప్లాన్ అమలు చేశారు. వారందర్నీ.. చెన్నైకు తీసుకు వచ్చి.. ఓ రిసార్టులో ఓదార్చాలని విజయ్ డిసైడయ్యారు.
సోమవారం రోజున ఆ కుటుంబాలకు చెన్నై శివారులోని ఓ లగ్జరీ రిసార్టులో ఓదార్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారమే ఆ కుటుంబాలన్నింటినీ రిసార్టుకు చేరుస్తున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి విడివిడిగా రూములు బుక్ చేశారు. అందరినీ కలిపి విజయ్ ఓదార్చడం లేదు. ప్రతి ఒక్క కుటుంబాన్ని విడివిడిగా విజయ్ ఓదార్చనున్నారు. పార్టీ తరపున ప్రకటించిన రూ. 20 లక్షల సాయం అందించనున్నారు. అలాగే ఆ కుటుంబాలను దత్తత తీసుకుంటానని.. పిల్లల చదువులు, ఇతర అవసరాలను తీరుస్తానని భరోసా ఇవ్వనున్నారు.
కరూర్ వెళ్లి పరామర్శించాలని అనుకుంటున్నా పోలీసులు అనుమతి ఇవ్వడం లేదని .. టీవీకే వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో తొక్కిసలాట ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ విచారణ జరుగుతోంది. ఎందుకైనా మంచిదని రోడ్ షోల జోలికి వెళ్లకపోవడం మంచిదని విజయ్ అనుకుంటున్నారు. త్వరలో మళ్లీ రాజకీయ ప్రచారం ప్రారంభించాలని అనుకుంటున్నారు. అందుకే ముందుగా ఓదార్పును పూర్తి చేయాలని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.