వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఓల్డ్ మోడల్ పాలిటిక్స్ తో తన రాజకీయాలు చేస్తోంది. ఆ పార్టీ నేతలు, మీడియా ఏం జరిగినా ప్రభుత్వాన్ని నిందించాలని రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో వారు ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడో లేదో.. తామే సృష్టించినా సరే శవాలతోనే వారి రాజకీయాలు ముడిపడి ఉంటున్నాయి. శవాలు దొరికినప్పుడే వారు రాజకీయంగా విపరీతంగా యాక్టివ్ నెస్ చూపించడం కామన్‌గా మారింది. ఫలితంగా శవరాజకీయాలతో పుట్టిన పార్టీ శవరాజకీయాలే చేస్తోందని విమర్శలు ఎదుర్కొంటోంది. నిజానికి ఇలాంటి రాజకీయాల వల్ల వైసీపీ ఏమైనా లాభపడుతుందా అంటే.. సోషల్ మీడియాలో ట్రోల్స్‌కు గురి కావడం.. వైసీపీ ఇక మారదని సామాన్యులు కూడా అనుకోవడానికి సరిపోతుంది. కానీ.. తటస్థులకు మెప్పించేలా లేదు.
బస్సు ప్రమాద ఘటనపై ఇలాంటి రాజకీయాలు సామాన్యులకూ కంపరమే !
కర్నూలులో బస్సు ప్రమాదం జరిగింది. 20 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన పెద్ద ఎత్తున చనిపోయారని తెలిసినప్పటి నుండి వైసీపీలోని ఆత్మలు నిద్రలేచాయి. శవాలు దొరికాయన్న సంతోషంతో అదే పనిగా ప్రచారం చేయడం ప్రారంభించారు. వారి ప్రచారం ఏ స్థాయిలో వెళ్లిందంటే.. చావుల్ని .. అదీ ప్రమాదాల్ని ఇలా రాజకీయం చేయవచ్చా అని అందరూ ఆశ్చర్యపోయారు. మొదట బస్సు ఫిట్ నెస్ పై తప్పుడు ప్రచారం చేశారు. తర్వాత బస్సుకు కులాన్ని అంటించారు. తర్వాత బెల్టు షాప్ అన్నారు. కానీ అన్నీ ఫేక్ అని.. అదే సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. తాము చెప్పేది నమ్మేవాళ్లుంటారని వైసీపీ నమ్మకం. కానీ నమ్మేవాళ్లు ఎప్పుడూ నమ్ముతారు. కానీ నిజాలు తెలిసిన వాళ్లు ఏమనుకుంటారో ఆలోచించరా ?
కల్తీ మద్యం పేరుతో ప్రతీ శవానికి లెక్కలు తీసి అభాసుపాలు
కల్తీ మద్యం ముఠాను పోలీసులు ఓ చోట పట్టుకుంటే.. ఇక రాష్ట్రమంతా కల్తీ మద్యం అమ్ముతున్నారని.. ప్రతి మరణం కల్తీ మద్యం వల్లేనని ప్రచారం చేయడానికి పెద్ద ప్లానే వేశారు. ఎంతగా అంటే.. సాక్షి పేపర్లో రోజూ.. లెక్కలు.. వేసుకుని జగన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేయడానికి ప్రణాళికలు వేశారు. ఆ కల్తీ మద్యం వ్యవహారం తమ నిర్వాకమేనని పోలీసులు బయట పెడుతూండటంతో ఇప్పుడు గతుక్కుమంటున్నారు. పైగా ప్రతీ మరణానికి కల్తీ మద్యమే కారణమని ప్రచారం చేయడం ద్వారా.. కేసులు ఎదుర్కోవాల్సిన వస్తోంది. ఈ శవ రాజకీయాలు ప్రజల్ని అసహనానికి గురి చేస్తున్నాయి.
కొత్తగా రాజకీయ వ్యూహాలు ఉండవా ?
రాజకీయాల్లో ఒక సారి సక్సెస్ అయిన ఫార్ములా ప్రతీ సారి పని చేయదని చెబుతూ ఉంటారు. జగన్ రెడ్డి తన రాజకీయ జీవితానికి శవాల ద్వారా ఓదార్పుయాత్రకు బీజం వేసుకున్నారు. అది సక్సెస్ అయింది. కానీ అదే పనిగా మళ్లీ మళ్లీ అదే మృతదేహాలతో రాజకీయం చేస్తే.. ప్రజలకు అసహ్యం వేస్తుంది. జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వందల మంది చనిపోయారు. కరోనా సెకండ్ వేవ్ లో చనిపోయినవాళ్లు చనిపోగా.. బతికిన వారిని తామే కాపాడుకున్నట్లుగా చెప్పుకున్నారు. తిరుపతిలో ఆక్సీజన్ అందక చనిపోయిన వారి దృశ్యాలు ఇంకా ప్రజల ముందే ఉంటాయి. తాడేపల్లి గూడెం కల్తీ మద్యం మరణాలు సహా ఎన్నో ఘోరాలు జగన్ హయాంలో జరిగాయి. ఇప్పటిలా.. అప్పుడు రాజకీయాలు జరగలేదు. కానీ వైసీపీకే శవరాజకీయాల బ్రాండ్ అన్నట్లుగా మారడంతో ప్రజలు కూడా.. ఇదేం పార్టీ అనుకోవడం ప్రారంభించారు. వైసీపీ ఇప్పటికైనా ఆ ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేస్తే బెటరేమో?
