దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాల్లో బీహార్ మొదటి స్థానంలో ఉంటుంది. అక్కడి ప్రజలు ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోయి ఉన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా అక్కడి ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పులు రావడం లేదు. అత్యధిక నిధులు కేటాయిస్తున్నా మౌలిక సదుపాయాల్లో కూడా అంతంత మాత్రమే మెరుగుదల కనిపిస్తోంది. దీనికి కారణం అక్కడి యువతలో చైతన్యం లేకపోవడమే కారణం. పనులు లేకపోవడం.. ఉపాధి కరువు కావడంతో.. యువత చెడు మార్గాలు పట్టారు. కానీ ఇప్పుడు వారిలో మార్పులు వస్తున్నాయి. మేమూ బాగుపడాలి కదా అనుకుంటున్నారు. అదే రాజకీయ పార్టీల ఆలోచనల్లోనూ మార్పులు తెలుస్తోంది.
తొలి సారి ఉద్యోగాలు, ఉపాధి ఎజెండా !
బీహార్ రాజకీయ పార్టీలు కుల సమీకరణాలు చూసుకుంటున్నా సరే ఈ సారి ఆయా పార్టీల అజెండాల్లో మొదటగా మార్పు కనిపిస్తోంది. దీనికి కారణం ఉద్యోగాలు, ఉపాధి కోసం యువత ఆలోచనలు పెరగడమే. తొలి సారి తేజస్వీ యాదవ్ బీహార్ కు పరిశ్రమలు తీసుకు వస్తానని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని.. ఉపాధి అవకాశాలు పెంచుతామని ప్రచారం చేస్తున్నారు. యువత కూడా వాటినే కోరుకుంటున్నారు. అందుకే తేజస్వీ యాదవ్ వాటినే హైలెట్ చేస్తున్నారు. ప్రస్తుత నితీష్ కుమార్ ప్రభుత్వం ఉపాధి కల్పనలో విఫలమయిందని.. తాను అందరికీ ఉపాధి చూపిస్తానని భరోసా ఇస్తున్నారు. ఎన్డీఏ తరపున మోదీ కూడా.. యువత కలలు నెరవేరుస్తామని అంటున్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి ఉద్యోగాలు, ఉపాధి, అభివృద్ధి వాదనే వినిపిస్తున్నారు.
దేశంలో అత్యధికంగా యువత వలసలు పోయే రాష్ట్రం బీహార్
బీహార్లో ఓటర్ల జాబితా సవరిస్తే.. అందులో లక్షల మంది శాశ్వతంగా వలస పోయారని ఓట్లను తొలగించారు. అది నిజమే.. బీహార్ నుంచి పొట్టచేత పట్టుకుని పోయిన వారు..మళ్లీ బీహార్ కు వెళ్లడానికి అక్కడేమీ లేదని.. ఉపాధి ఉన్న చోటనే .. ఏదో ఓ పని చేసుకుని బతికేస్తున్నారు. అలాగే లక్షల మంది యువత.. చిన్న చిన్నపనుల కోసం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్ కతా, గుర్గావ్, ఢిల్లీలకు వెళ్తున్నారు. చాలా రాష్ట్రాల్లో యువత వైట్ కాలర్ జాబ్స్ కోసం వలస వెళ్తారు. కానీ బీహార్ యువత మాత్రం ..చిన్న చిన్న పనుల కోసం వెళ్తారు. ఇలాంటి పరిస్థితి మారాలని తమ రాష్ట్రంలోనే తమకు ఉపాధి దక్కాలని యువత కోరుకుంటున్నారు.
యువతలో కుల, మత భావన కన్నా ఉపాధి అంశం ప్రభావమే ఎక్కువ !
బీహార్లోని యువత ఈ సారి కుల, మత ప్రభావం కన్నా… తమ బతుకుల్ని ఎవరు బాగు చేస్తారని నమ్మితే వారికే ఓట్లు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎక్కువగా కుల సమీకరణాలతోనే ఓటింగ్ జరిగేది. కానీ ఈ సారి వారు ఎక్కువ తమ ఆశల్ని ఎవరు నెరవేరుస్తారో వారికి ఓట్లేసే అవకాశం ఉంది. బీహార్ రాజకీయాల్లో యువనాయకుడిగా.. తమ ప్రతినిధిగా.. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ను ఎక్కువ మంది చూస్తున్నారు. యువతలో ఎక్కువ మంది ఆయన సీఎం కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్, ఆర్జేడీతో కూటమికి అదే అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది.
