ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పు, సరిహద్దుల సవరణల ప్రతిపాదనలను ఖరారు చేసేందుకు సిద్ధమవుతోంది. మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశమై ప్రతిపాదనలపై చర్చించనుంది. ఆయన సూచనలతో తుది నివేదిక సిద్ధం చేసి, నవంబర్ 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం కోసం ప్రవేశపెడతారు. జనగణన కారణంగా డిసెంబర్ 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది.
టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కొన్ని
ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు ప్రతిపాదన ఉంది. ఇందులో కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలు చేరే అవకాశం ఉంది. అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో తిరిగి చేర్చే హామీని స్థానిక ప్రజాప్రతినిధులు ఇచ్చారు. రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు నాలుగు విలీన మండలాలతో ఏజెన్సీ ప్రాంతంలో కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రతిపాదన ఉంది. రంపచోడవరం నుంచి ప్రస్తుత జిల్లా కేంద్రం పాడేరుకు 187 కి.మీ. దూరం ఉండటంతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని టీడీపీ హామీ ఇచ్చింది.
అమరావతి కేంద్రంగా జిల్లా
పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నియోజకవర్గాలతో అమరావతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు ఆలోచన జరుగుతోంది. రాజధాని శాంతిభద్రతలు, ప్రొటోకాల్ విధులు, రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు వేదికగా అమరావతి మారుతుండటంతో జిల్లాగా ఉండటం మంచిదన్న సూచనలు ఉన్నాయి. అలాగే మదనపల్లె కేంద్రంగా జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై నివేదికలో వివరాలు ఉంటాయని భావిస్తున్నారు. అద్దంకి, మడకశిరతో సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక నియోజకవర్గం రెండు లేదా మూడు డివిజన్లలో ఉంటే, పరిపాలనా సౌలభ్యం కోసం ఒకే నియోజకవర్గ పరిధిలోకి తీసుకొచ్చే యోచన ఉంది. కొన్ని మండలాల విభజనలకూ ప్రతిపాదనలు వచ్చాయి.
వివాదాలు రాకుండా పూర్తి చేయగలరా ?
ప్రభుత్వం ఏడుగురు మంత్రులతో జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల, గ్రామ సరిహద్దులు, పేర్ల మార్పుపై ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘం తొలి సమావేశం ఆగస్టు 13న సచివాలయంలో జరిగింది. జిల్లా కలెక్టర్లు వివిధ వర్గాలు, ప్రజాసంఘాల నుంచి వినతులు స్వీకరించారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల నుంచి కూడా సుమారు 200 అర్జీలు అందాయి. మూడు రోజుల క్రితం జరిగిన సమావేశంలో ఈ అర్జీలపై చర్చించి, జిల్లా అధికారుల అభిప్రాయాలు తీసుకున్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా.. వివాదం సృష్టించడానికి కొంత మంది రెడీగా ఉంటారు. పేర్ల మార్పు ప్రతిపాదనలు ఉన్నాయో లేదో కానీ గతంలో ప్రచారంలోకి రాగానే సోషల్ మీడియాస్ రకరకాలుగా స్పందించారు. పూర్తి ప్రతిపాదనలు వెలుగులోకి వస్తే అసలు రాజకీయం ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
