కాంగ్రెస్ పార్టీ సొంతంగా అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో రెండు పెద్ద రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక. ఈ రెండు రాష్ట్రాలతోనే ఆ పార్టీ పెద్దలు ఓ ఆట ఆడుకుంటున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్యను మార్చేస్తారని ప్రచారం చేయడానికి కావాల్సినంత పెట్రోల్ పోసి చాలా కాలం అయింది. అది ఇంకా మండుతూనే ఉంది. తెలంగాణలో అంత ఎక్కువగా లేకపోయినా.. రేవంత్ రెడ్డికి సెగ తగిలేలా చేస్తున్నారని అందరికీ అర్థమవుతోంది. ఇప్పుడు కొత్తగా రెండు రాష్ట్రాల్లో కేబినెట్లను పునర్వ్యవస్థీకరించబోతున్నారని లీకులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రుల్ని మార్చరు కానీ.. మంత్రుల్ని మాత్రం మార్చేస్తారని చెబుతున్నారు.
కర్ణాటక … ఇప్పటికే రోడ్డున పడ్డ కాంగ్రెస్
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రోడ్డున పడింది. డీకే శివకుమార్ రెక్కల కష్టంతో అధికారంలోకి వస్తే.. సామాజిక సమీకరణాలు అని సిద్ధరామయ్యను సీఎంను చేశారు. డీకే శివకుమార్ ను బుజ్జగించారు. సగం కాలం తర్వాత .. డీకేకు చాన్స్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు సిద్ధరామయ్య తాను వైదొలిగిది లేదంటున్నారు. కానీ సిద్ధరామయ్యను తప్పించడం ఖాయమన్న సంకేతాలను ఓ వైపు ఇస్తున్నారు. చివరికి సిద్ధరామయ్య కుమారుడు కూడా అదే అంటున్నారు. ఇదే సందు అనుకుని చాలా మంది తామే తర్వాత సీఎం అని ప్రచారం చేసుకుంటున్నారు. సిద్ధరామయ్యను తప్పించినా శివకుమార్ ను సీఎం చేయరని కొంత మంది ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ రోడ్డున పడింది. నవంబర్ లో .. సీఎం మార్పు ఉండదు కానీ..మంత్రుల్ని మాత్రం మారుస్తారని కొత్తగా రాజకీయం ప్రారంభించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ను రోడ్డున పడేసిన పెద్దలు
అధికారంలో ఉంటే.. గుట్టుగా ఉండాల్సిన పార్టీ వ్యవహారాలు రోడ్డున పడ్డాయి. పవర్ ఇస్తే కలసి కట్టుగా పార్టీని నడిపే రేవంత్ కు ప్రాధాన్యం తగ్గించి గ్రూపుల్ని పెంచడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పుడు మంత్రుల్ని మారుస్తామంటూ ప్రచారం ప్రారంభిచారు. మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే.. మంత్రుల్ని ఎలా మారుస్తారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. మంత్రి పదవి కోసం ముఖ్యమంత్రి మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డికి చిన్న హెచ్చరిక ఇవ్వడానికి హైకమాండ్ ఇష్టపడటం లేదు. కానీ పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ కు మాత్రం అనేక ఆంక్షలు పెడుతున్నారు. ఇప్పుడు కేబినెట్ లో మార్పు చేర్పులంటే.. రేవంత్ రెడ్డికి పెద్ద సమస్యలు తెచ్చి పెట్టినట్లే అనుకోవచ్చు.
ముఖ్యమంత్రుల్నీ మారుస్తారనే ప్రచారానికి చెక్ పెట్టని వైనం
కాంగ్రెస్ హైకమాండ్ .. తమ పార్టీ ముఖ్యమంత్రుల్ని ఎందుకు బలహీనుల్ని చేయాలని అనుకుంటుందో కానీ.. వారి మార్పుల గురించి వచ్చే ప్రచారానికి పరోక్షంగా అయినా చెక్ పెట్టే ప్రయత్నమే చేయదు. వారు పార్టీని మించి ఎదిగిపోతారని అనుకుంటారేమో కానీ.. వారిని బలహీనం చేస్తే తాము బలహీనం అవుతామని అనుకోవడం లేదు. ఇలాంటి ప్రచారాల వల్ల హైకమండ్ వద్దకు.. లాబీయింగ్ కోసం వెళ్లేవారికి సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి వాతావరణమే.. వారికి కావాలేమో కానీ.. అధికారంలో ఉన్న రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాలు మాత్రం చేతులు నెత్తి మీద పెట్టుకున్నట్లుగానే ఉంటున్నాయి.
