పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.. పేరుకు తగ్గట్టుగానే ఫ్యాక్టరీ మోడల్ లో సినిమాలు తీసే సంస్థ. అత్యంత వేగంగా 100 సినిమాలు పూర్తి చేయాలన్న ధ్యేయంతో ఈ ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. అనుకొన్నట్టుగానే చాలా వేగంగా సినిమాలు తీశారు. 50 సినిమాల మైలు రాయిని కూడా చాలా తక్కువ సమయంలో దాటేశారు. కాకపోతే.. విజయాల శాతం చాలా తక్కువ. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చుట్టూ ఫ్లాపులు పరిభ్రమిస్తున్న తరుణంలో ‘మిరాయ్తో’ ఓ మంచి హిట్ దక్కింది. దాదాపు రూ.150 కోట్లు వసూలు చేసిన సినిమా ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు గౌరవాన్ని తెచ్చి పెట్టింది. కాస్త ఊపిరి తీసుకొనేంత స్పేస్ ఇచ్చింది. ఆ సినిమా ఇచ్చిన ఆనందాన్ని, ఉత్సాహాన్ని ‘తెలుసు కదా’ సగం వెనక్కు లాగేసింది. ఈ సంస్థ నుంచి వచ్చిన మరో సినిమా ఇది. విడుదలకు ముందే ఎలాంటి హైప్ లేదు. విడుదల తరవాత కూడా అదే పరిస్థితి. లో బజ్ తో వచ్చిన సినిమా ఇది. ఓపెనింగ్స్ కూడా అంతంత మాత్రమే. చివరికి ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది.
ఓవరాల్ గా రూ.40 కోట్లతో ఈ సినిమాని రూపొందించారు. నాన్ థియేట్రికల్ రూపంలో రూ.16 కోట్ల వరకూ వచ్చాయి. సిద్దు జొన్నలగడ్డ ఇమేజ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ వాల్యూపై ఓటీటీకి ఈమాత్రం రేటు వచ్చింది. థియేట్రికల్ నుంచి కనీసం రూ.5 కోట్ల షేర్ కూడా రాలేదు. ఎలా చూసినా ఈ సినిమా ద్వారా పీపుల్ మీడియాకు రూ.15 కోట్ల వరకూ నష్టం వచ్చిందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ఓటీటీ హక్కులు ముందే అమ్ముకోవడం వల్ల ఈమాత్రం నష్టాలతో బయటపడాల్సివచ్చింది. లేకపోతే… ఆ నష్టభారం మరింతగా ఉండేది.
దీపావళికి మూడు సినిమాలో పోటీ పడడం కూడా కొంతమేర ప్రభావం చూపించింది. అదే సోలోగా వచ్చి ఉంటే వసూళ్లు కాస్తయినా బాగుండేవి. సోలో రిలీజ్ డేట్ కోసం హీరో సిద్దు జొన్నలగడ్డ చివరి వరకూ ప్రయత్నించారని, అయితే ఓటీటీ కమిట్మెంట్స్ వల్ల కుదర్లేదని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకు సిద్దు కర్త, కర్మ, క్రియ అన్నీనూ. స్క్రిప్టు విషయంలో ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా వరకూ వుంది. కొన్ని సీన్లకు ఆయనే డైరెక్టర్ గా వ్యవహరించార్ట. కాబట్టి ఈ ఫ్లాపులో ఆయనదే ఎక్కువ వాటా అనుకోవాలి.
