ఇండీ కూటమికి అత్యంత ముఖ్యమైన బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇండీ కూటమి అభ్యర్థుల కోసం లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు, ఆర్జేడీని నడిపిస్తున్న తేజస్వీయాదవ్ బీహార్ అంతటా పర్యటిస్తున్నారు. కూటమి మొత్తానికి ఆయన ఒక్కడే ప్రచార సారధిగా మారారు. ఆయన కష్టం చూసి..అందరూ రాహుల్ గాంధీ ఎక్కడ అనే ప్రశ్నలు సంధిస్తున్నారు. రెండు నెలల క్రితం ఓటర్ అధికార్ యాత్ర చేసి వెళ్లిన రాహుల్.. మరోసారి బీహార్లో అడుగు పెట్టలేదు. దీంతో బీహార్ రాజకీయవర్గాలతో పాటు సామాన్యూల్లోనే ఇదే చర్చ జరుగుతోంది. రాహుల్ గాంధీ ఎక్కడ అని ప్రశ్నించేవారు ఎక్కువయ్యారు.
బీహార్లో ఇంకా ప్రచారం ప్రారంభించని రాహుల్ గాంధీ
ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోదీ విస్తృతంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రచారం ఊపందుకుంటే.. మోదీ చేసే ప్రచారం గురించి చెప్పాల్సిన పని లేదు. మరో వైపు నితీష్ కుమార్ కూడా ప్రచారం చేస్తున్నారు. కానీ ఇండీ కూటమి తరపున ఒక్క తేజస్వీ మాత్రమే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ 61 స్థానాల్లో పోటీ చేస్తోంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన సీట్లలో మెజార్టీ గెలవాలి. గత ఎన్నికల్లో ఇలాగే 70కిపైగా సీట్లు తీసుకుని కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సీట్లలో గెలవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఈ సారి కూడా రాహుల్ గాంధీ నిర్లక్ష్యంతో అలాంటి పరిస్థితే వచ్చినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.
ఓట్ చోరీ పేరుతో చేసిన రాజకీయం ఫ్లాప్
రాహుల్ గాంధీ ఎందుకు బీహార్ కు ప్రచారానికి వెళ్లడం లేదనేది రాజకీయవర్గాలకు అంతు చిక్కడం లేదు. అడిగిన్ని సీట్లు ఇవ్వలేదనో.. తమ రాజకీయాలను లాలూ ప్రసాద్ యాదవ్ పడనీయలేదనో ఆయన ఫీలవుతున్నారేమో స్పష్టత లేదు కానీ అసలు రాహుల్ చప్పుడు లేదు. నిజానికి బీహార్ లో.. ఓట్ల చోరీ అంశాన్ని ఎన్నికల అజెండా చేద్దామనుకున్నారు. కానీ అందులో నిజాయితీ లేకపోవడంతో పట్టించుకున్న వారు లేరు. ఇప్పుడు బీహార్ లో కులగణన ఓటింగ్ అంశం కాదు.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, యువత వలస పోకుండా ఏం చేయాలన్నది రాజకీయ అంశంగా మారింది. రాహుల్ గాంధీ తనకు ఇష్టమైన టాపిక్ ను మార్చి ఈ అంశాలపై ప్రచారం చేయడానికి అంత ఆసక్తిగా లేరు.
రాహుల్ కాడి పడేసే చర్యలతోనే కాంగ్రెస్కు నష్టం
కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు కుంచించుకుపోవడానికి కారణం రాహుల్ గాంధీ శుష్క నాయకత్వమే. ఆయన చేసే పార్ట్ టైమ్ రాజకీయాలు, ప్రజలతో టచ్ ఉండని స్ట్రాటజీలు.. ఆయననో వైఫల్య నాయకుడిగా నిలబెట్టాయి. ఎప్పటికప్పుడు దాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు కానీ..తన పనితీరుతో.. మెరుగైన నేతనని.. విజయాలు తెచ్చి పెట్టగలనని మాత్రం అనుకోవడం లేదు. అలా అనుకుని ఉంటే… అత్యంత కీలకమైన ఎన్నికలను ఇంత ఆషామాషీగా తీసుకుని ఉండరేమో ?
