ఈమధ్య కాలంలో చిత్రసీమలో పని గంటలకు సంబంధించిన చర్చ చాలా గట్టిగా సాగుతోంది. కథానాయిక దీపికా పదుకొణె 5 నుంచి 6 గంటల కంటే ఎక్కువ పని చేయనని తేల్చేసిన తరవాత అసలు హీరో, హీరోయిన్లు ఇలాంటి కండీషన్లు ఎందుకు పెడుతున్నారు? వాళ్లకు సినిమాల కంటే… షరతులే ఎక్కువ అయిపోతున్నాయా, ఇంతింత పారితోషికాలు తీసుకొంటూ నిర్మాతల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ విమర్శలు పెరుగుతున్నాయి. ఈ విషయంలో మిగిలిన కథానాయికల స్టేట్మెంట్లు కూడా కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రష్మిక స్పందించింది. పనిగంటల గురించి తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించింది.
అందరిలా తనకు కూడా నిర్దిష్టమైన పనివేళలుంటే బాగుంటుందని తనకూ అనిపిస్తుందని, ఆఫీస్‌కి వెళ్లి వచ్చినట్టు 9 నుంచి 6 గంటల వరకూ పని చేయాలని అనిపిస్తుందని, అయితే ఒక్కోసారి నిర్మాతల ఇబ్బందుల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని అందుకోసం కాస్త అటూ ఇటూ అయినా సర్దుకోవాలని అంటోంది రష్మిక. ”సెట్ లో తీయాల్సిన సన్నివేశాలు మిగిలే ఉండొచ్చు. రేపటి నుంచి సెట్ అందుబాటులో ఉండకపోవొచ్చు. అందుకే… కాస్త ఇబ్బందే అయినా ఇంకొంత సమయం కేటాయించి, నా పని పూర్తి చేయాల్సి ఉంటుంది. సినిమా అంటే నేనొక్కదాన్నే కాదు. వంద మంది పని చేస్తారు. నా వల్ల వాళ్లు ఇబ్బంది పడకూడదు. అందరి కంటే నాకు ఎక్కువ పారితోషికం ఇస్తున్నప్పుడు దానికి తగ్గట్టు పని చేయాలి. అయితే నాకంటూ కొంత సమయం అట్టిపెట్టుకోవాలి. నిద్ర, ఆరోగ్యం కాపాడుకోవడం ఇవన్నీ ముఖ్యమే. కుటుంబానికీ సమయం కేటాయించాలి. నేను సమయానికి పడుకొని, వేళకు తింటేనే ఫిట్ గా ఉంటాను. అప్పుడే ఇంకాస్త బాగా పని చేయగలను. ఈ విషయాన్ని కూడా నిర్మాతలు అర్థం చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఎక్కువ సమయం సెట్లో గడుపుతున్నా. అలసిపోతున్నా పని చేస్తున్నా. ఇది మంచిది కాదని నాకూ తెలుసు” అని చెప్పుకొచ్చింది.
దీపికలా 5 గంటలే పని చేస్తా అని చెప్పడం కరెక్ట్ కాదు. అలాగని మరీ 10 గంటలూ 12 గంటలూ పీడించేయడం కూడా భావ్యం కాదు. సెట్లో పరిస్థితుల్ని బట్టి, నిర్మాత ఇబ్బందుల్ని అర్థం చేసుకొని కాస్త అటూ ఇటుగా సర్దుకుపోవడం చాలా అవసరం. ‘నాకింత పారితోషికం కావాలి’ అని డిమాండ్ చేసి తీసుకొంటున్నప్పుడు, సదుపాయాల్ని కూడా పోరాడి దక్కించుకొంటున్నప్పుడు నిర్మాత అవసరాల్ని బట్టి, సందర్భాన్ని బట్టి కష్టపడాల్సివస్తుంది. హీరోయిన్లు ఒకేసారి నాలుగైదు సినిమాలు చేస్తున్నప్పుడు ఒకే సినిమాకి డెడికేటెడ్ గా పని చేయడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు సినిమాల్ని తగ్గించుకొంటూ, ప్రొడెక్టీవ్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తే అటు తమకూ, నిర్మాతలకూ కూడా సౌలభ్యకరంగా ఉంటుంది.
