అమరావతి రైతుల సమస్యలను చిలువలు, పలువులు చేసే ప్రయత్నంలో ఉన్న కొంత మంది జర్నలిస్టులు విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నారు. తాను ఇచ్చిన ఐదు సెంట్లకు తనకు రిటర్నబుల్ ప్లాటే కావాలని.. టీడీఆర్ బాండ్లు వద్దని ఓ వృద్ధురాలు కోర్టుకెళ్లింది. ఆమెకు ఎవరు ఐడియా ఇచ్చారో కానీ కారుణ్య మరణం వంటి పెద్ద మాటలు పిటిషన్ లో చేర్చడంతో హైలెట్ అయింది. ఈ అంశంపై కందుల రమేష్ అనే సీనియర్ జర్నలిస్టు వీడియో చేశారు. దాన్ని అమరావతి అంటే విద్వేషం చూపించే వారంతా విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. దీనిపై సీఆర్డీఏ క్లారిటీ ఇచ్చింది.
ఆ క్లారిటీపైనా కందుల రమేష్ స్పందించారు. తాను చెప్పిన కథనంలో ఏముందో..సీఆర్డీఏ కూడా అదే వివరణ ఇచ్చిందని ఆయన వాదన. మరి సమస్య ఎక్కడ వచ్చింది?. నిబంధనలు అడ్డం పెట్టుకుని అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారన్నది కందుల రమేష్ వాదన. అధికారులు నిబంధనల ప్రకారం మాత్రమే వ్యవహరించాలి. అలా వ్యవహరిస్తేనే కరెక్ట్ గా చేసినట్లు. నిబంధనలకు అతిక్రమించి ఏం చేసినా.. చివరికి మంచి చేసినా అది అడ్డగోలు అవుతుంది. అలాంటి అడ్డగోలు పని చేయాలని కందుల రమేష్ అంటున్నట్లుగా ఉంది.
సీఆర్డీఏ నిబంధనలు .. చట్టబద్ధమైనవి. ఆ నిబంధనల్లో ఐదు సెంట్లు ఇచ్చినవారికి రిటర్నబుల్ ప్టాట్లు రాదని టీడీఆర్ బాండ్లు వస్తాయని అందులో ఉన్నాయి. దాన్ని మీరి అధికారులు రిటర్నబుల్ ప్టాట్ కేటాయించగలరా? . అసాధ్యం. ఇక్కడ ఆమె టీడీఆర్ బాండ్లు ఏం చేసుకుంటారని.. కందుల రమేష్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే చెప్పాలి. టీడీఆర్ బాండ్లు ఏం చేసుకుంటారు? అసలు ఎందుకు ఇస్తారో చెప్పాలి?. ఆ వృద్ధురాలికి ఆ ఐదు సెంట్ల స్థలం ఇచ్చేటప్పుడు అధికారులు చెప్పి ఉంటారు. ఆమె అంగీకారంతోనే స్థలం ఇచ్చారు. ఇప్పుడు ఆమె ఉండటానికి ఇల్లు ఉండదు అంటే.. ఆమెకు ఏమైనా సాయం చేయాలంటే అది రాజకీయపరంగా చేయాలి.
మున్సిపల్ మంత్రి లేదా ముఖ్యమంత్రి మాత్రమే ఆ వృద్ధురాలికి ఏమైనా సాయం చేయగలరు. పేదలకు కట్టే ఇళ్లలో ఆమెకు ఓ ఇల్లు కేటాయించవచ్చు. లేదా ప్రత్యేక కేసుగా పరిగణించి ఇంటి స్థలం ఇచ్చే ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ అది ప్రత్యేకంగా చేసే సాయం మాత్రమే అవుతుంది. సీనియర్ జర్నలిస్టు ఆ విషయాన్ని మర్చిపోయారు. ఆ వృద్ధురాలిపట్ల సానుభూతి ఉండటంలో తప్పు లేదు. కానీ..ఆ పేరుతో అమరావతి మొత్తంపై తప్పుడు ప్రచారం చేయడం వెనుక దురుద్దేశం ఉంటుందని ఎవరికైనా అనిపిస్తుంది. సీనియర్ జర్నలిస్టులకు ఈ విషయం చెప్పాల్సిన పని లేదు. హెడెన్ ఎజెండా ఉందో లేదో .. తెలిసిపోతుంది.