మాజీ క్రికెట్ కెప్టెన్ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి వచ్చేస్తోంది. శుక్రవారం ఆయన రాజ్ భవన్ లో ప్రమాణం చేయనున్నారు. కేబినెట్ లో ఇప్పటికీ మూడు ఖాళీలు ఉన్నాయి. వాటిలో ఒక దాన్ని భర్తీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయనకు.. ఉపఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. కానీ మంత్రి పదవి మాత్రం వెదుక్కుంటూ వచ్చేసింది. జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో మైనార్టీ ఓటర్లు కీలకం కావడంతో.. వారిని ఆకట్టుకునేందుకు మంత్రి వర్గంలోకి మైనార్టీ నేతను తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ కేబినెట్లో మైనార్టీ లేరు. అందుకే ఆ లోటును భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఇటీవల మహేష్ కుమార్ గౌడ్ కూడా కేబినెట్ లోకి మైనార్టీని తీసుకుంటారని చెప్పారు. అయితే ఇంత వేగంగా నిర్ణయం తీసుకుంటారని అనుకోలేకపోయారు. అజహరుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా సిఫారసు చేశారు. ఆ సిఫారనును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. అంటే ఆయన అధికారికంగా ఎమ్మెల్యే కాదు. అయినప్పటికీ మంత్రిగా ప్రమాణం చేయించాలని నిర్ణయించారు. అజహరుద్దీన్ కు ఇది జాక్ పాట్ లాంటిదే అనుకోవచ్చు.
క్రికెటర్ గా రిటైరన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఉత్తరప్రదేశ్ నుంచి ఓ సారి గెలిచారు. రాజస్థాన్ నుంచి మరోసారి పోటీ చేసి ఓడిపోయి..తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. కానీ ఆయన ఎప్పుడూ పెద్దగా యాక్టివ్ గా లేరు. హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న నేతగా ఆయనకు అవకాశాలు వస్తున్నాయి. పేరున్న మైనార్టీ నేత కావడం కలసి వస్తోంది.
