తిరుమలలో కల్తీ నెయ్యి స్కాంలో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నను సీబీఐ సిట్ అరెస్టు చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన పాత్ర కీలకమని తేలడంతో అరెస్టు చేశారు. అయితే పీఏగా ఉన్న ఆయన సుబ్బారెడ్డి చెప్పినట్లుగా చేస్తారు కానీ.. సొంతంగా ఏమీ చేయలేరు. మొత్తం సుబ్బారెడ్డి చేస్తే ఆయనను అరెస్టు చేయాల్సింది..పీఏను అరెస్టు చేస్తే ఏమి వస్తుందన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే నేడో రేపో సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేయనున్నట్లుగా తెలుస్తోంది.
కల్తీనెయ్యి సూత్రధారి వైవీ సుబ్బారెడ్డే !?
ఎంపీ టిక్కెట్ ఇవ్వలేకపోయిన దానికి పరిహారంగా అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానాలను తన బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి గుప్పిట్లో పెట్టారు జగన్ రెడ్డి. ఆయన పాటించే మతంపై అనుమానాలున్నా.. అధికారం ముందు తేలిపోయాయి. కానీ సుబ్బారెడ్డి దేవుడి సన్నిధిలో అపరచారానికి పాల్పడ్డారని తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. నకిలీ నెయ్యి తయారు చేసే భోలేబాబాకు నెయ్యి కాంట్రాక్టులు ఇచ్చారు. కోట్ల కమిషన్లు తీసుకున్నారు. నాణ్యత కారణంగా ఆ కంపెనీని పక్కన పెట్టినా వేరే కంపెనీల పేరుతోనూ ఆ కంపెనీనే నెయ్యి పంపేది. ఇదంతా సుబ్బారెడ్డి కనుసన్నల్లో జరిగింది. అప్పన్న .. పనులు చక్కబెట్టేవారు.
విచారణ జరగకుండా కోర్టుల్లో పిటిషన్లు వేసిన అప్పన్న
కల్తీ నెయ్యి స్కాం సుబ్బారెడ్డి దగ్గరకు వస్తూండటంతో అప్పన్న కోర్టుల్లో పిటిషన్లు వేసి.. విచారణను చాలా కాలం నిలిపివేయించారు. సిట్ అధికారులే తనకు నోటీసులు జారీ చేయాలని కానీ ఇతర పోలీసులు జారీ చేశారని హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు ఆయన వాదనను సమర్థించింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేసిది. సిట్ అనుమతించిన ఎవరైనా దర్యాప్తు చేయవచ్చని స్పష్టం చేసింది. దాంతో. శ్రీవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించిన నకిలీ నెయ్యి పాపం పండటానికి సిద్ధమైంది.
సూత్రధారులను అరెస్టు చేస్తేనే?
దేవుడిని దోచుకోవడం చిన్న తప్పు కాదు. దేవుడే శిక్షిస్తాడని వదిలేయడం కూడా మంచిది కాదు. దేవుడే వారి కల్తీ వ్యవహారాన్ని బయట పెట్టేలా చేశారు. ఇప్పుడు శిక్షించాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉంది. సూత్రధారుల్ని అరెస్టు చేసి.. దేవుడి జోలికి వస్తే ఎవరికైనా అదే పరిస్థితి వస్తుందని.. తెలిసేలా చేయాల్సి ఉంది. సుబ్బారెడ్డి అయినా.. కరుణాకర్ రెడ్డి అయినా అన్నీ తెలిసినా సైలెంటుగా గా ఉన్న ధర్మారెడ్డిని అయినా.. చట్టం ముందు నిలబెట్టాల్సిందే!
