బీహార్ రాజకీయాల్లో ఎన్డీఏ పెద్దలు కొన్నింటిని తప్పించుకోలేకపోతున్నారు. పార్టీ విజయానికి పూర్తి స్థాయిలో అడ్డం పడతాయని భావిస్తున్న అంశాలను తప్పించలేకపోతున్నారు. ఫలితంగా ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమికి కలసి వచ్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ఒకటి మళ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నితీష్ కుమార్ ను ప్రకటించడం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు, పాలనపై వ్యతిరేకత ప్రజల్లో ఎక్కువగా ఉందన్న ప్రచారం కారణంగా ఈ సారి ఎన్డీఏ గెలిస్తే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి వస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఎన్నికలు కాస్త టైట్ గా ఉంటాయని.. అనుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు నితీష్నే మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించేశారు. దీంతో తేజస్వీ ఊపిరి పీల్చుకున్నారు.
నితీష్ ను చూసి చూసి విసిగిపోయారు.. తేజస్వీ కొత్త !
బీహార్ ప్రజలకు నితీష్ ముఖ్యమంత్రిగా పాతబడిపోయారు. ఆయన ఏ కూటమితో జతకట్టినా సీఎంగా బాధ్యతలు చేపడుతూ వస్తున్నారు. మధ్యలో కొంత కాలం..రాజకీయ వ్యూహంలో భాగంగా జీతన్ రాం మాంఝీని సీఎంను చేసినా.. మళ్లీ ఎన్నికల్లో గెలిచి ఆయనే సీఎం పదవి చేపట్టారు. ఆయన పాలనలో బీహార్ లో శాంతిభద్రతలు మెరుగుపడ్డాయి కానీ ప్రజల జీవితాలు మారడం లేదు. ఎప్పుడూ నితీషేనా అన్న భావన కూడా అక్కడ ప్రజల్లో పెరిగిపోయింది. తేజస్వీ యాదవ్ వారికి ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. తండ్రిలా కాకుండా కాస్త తెలివిగా రాజకీయం చేస్తూండటంతో ఆయనకు బీహార్ యువతలో ఆదరణ వచ్చింది.
అన్ని సర్వేల్లో తేజస్వీ యాదవ్ కే సీఎం అభ్యర్థిగా మొగ్గు
నితీష్ కుమార్ సీఎంగా ఉన్నప్పటికీ.. బీహార్ ఎన్నికలపై అనేక సంస్థలు నిర్వహించిన సర్వేల్లో సీఎం అభ్యర్థిగా తేజస్వీకే ఎక్కువ ఆదరణ లభించింది. తర్వాత స్థానంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇది ప్రజలు మార్పు కోరుకుంటున్న దానికి సంకేతంగా చెప్పవచ్చు. లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడిగా రాజకీయాలు ప్రారంభించిన తేజస్వీ..తండ్రి సలహాలకే పరిమితమైనా.. తన రాజకీయం తాను చేస్తున్నారు. బీజేపీ పెట్టే కేసులకు తలొగ్గకుండా పార్టీని నడిపించుకుంటున్నారు. అదే సమయంలో.. ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అని ఊరిస్తున్నారు. ఆయన సీఎంగా ఇప్పటి వరకూ చేయలేదు కాబట్టి..సీఎం అయితే ఇస్తారేమో అన్న ఆశతో మేనిఫెస్టో పట్ల బీజేపీ ప్రజలు ఆర్షితులయ్యే అవకాశం ఉంది.
తేజస్వీకి పోటీగా మరో యువనేతను ప్రకటిస్తే గట్టి పోటీ ఉండేది !
నితీష్ కుమార్ ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మూడో అతి పెద్ద పార్టీగా నితీష్ ఉన్నారు. కేంద్రంలో ప్రభుత్వానికి ఆయన మద్దతు కీలకం. అందుకే మోదీ, అమిత్ షా ఆయనను కాదని ఇతరుల్ని సీఎం అభ్యర్థిగా ప్రకటించే సాహసం చేయలేరు. కానీ ఇప్పటికీ చాలా మందికి నిజంగా ఎన్డీఏ గెలిస్తే.. నితీష్ కుమార్ సీఎం అయ్యే అవకాశం ఉండదని.. బీజేపీ ఖచ్చితంగా తనదైన రాజకీయం చేస్తుందని నమ్ముతున్నారు. కానీ బహిరంగంగా ప్రకటించలేకపోతున్నారు. ఇప్పుడే నితీష్ ను ఒప్పించి.. తేజస్వీకి పోటీగా ఓ కొత్త యువనేతను.. ఫోకస్ చేసి ఉంటే.. గట్టి పోటీకి అవకాశం ఉండేదని.. కానీ ఇప్పుడు పోరు ఏకపక్షమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. బీహార్ రాజకీయ ముఖ చిత్రం అలాగే మారుతోంది.
